ప్రజాశక్తి-విజయనగరంకోట : నగరంలో 12రోజుల పాటు జరిగిన డ్వాక్రాబజార్ విజయవంతం కావడం పట్ల డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన చేతి ఉత్పత్తి దారులు తయారు చేసిన వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఆదరించారని అన్నారు. జిల్లా కేంద్రంలోని లోయర్ టాంక్ బండ్ రోడ్డులో నిర్వహించిన సరస్ ముగింపు సందర్భంగా బుధవారం ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ శాఖలు, సంస్థల వారికి అభినందన సభ జరిగింది. ఈప్రదర్శనకు ప్రజల నుంచి ఏ విధమైన ఆదరణ వుంటుందో అనే సందేహాల నేపధ్యంలో రూ.6.39 కోట్ల వ్యాపారం జరిగిందని డిప్యూటీ స్పీకర్ అన్నారు. బజార్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం, డిఆర్‌డిఎ అధికారులు చేసిన కృషిని జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అభినందించారు డ్వాక్రా బజార్ లో మొత్తం 195 స్టాల్ లు ఏర్పాటయ్యాయనీ ఇందులో మన రాష్ట్రం నుంచి 152, మరో 14 రాష్ట్రాల నుంచి 45 స్టాల్ లు ఏర్పాటైనట్లు డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సహాధిత్ వెంకట్ త్రివినాగ్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు నాయుడు, మెప్మా పీడీ సుధాకర్, డిఆర్‌డిఎ ఎపిడి సావిత్రి పాల్గొన్నారు.