Apr 12,2023 00:40
జిడిసిసి బ్యాంకు

ప్రజాశక్తి-రేపల్లె: మహిళలకు ఆర్థిక సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పట్టణ పేదరిక నిర్ములనా సంస్థ (మెప్మా) అక్రమాలకు అడ్డాగా మారింది. బాపట్ల జిల్లా, రేపల్లె పురపాలక సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న మెప్మాలో పనిచేస్తున్న యానిమేటర్లు స్వయం సహాయక సంఘాలను అడ్డుపెట్టుకుని రుణాల పేరుతో బ్యాంకులను బురిడీ కొట్టించారు. అందిన వివరాల ప్రకారం.. మెప్మాలో ఆర్పీలుగా పనిచేస్తున్న పట్టణంలోని 21వ వార్డుకు చెందిన ఇద్దరు మహిళలు, మరో మహిళ సహకారంతో 2019 ఏప్రిల్‌ 11కు ముందు ఉన్న గ్రూపులను టార్గెట్‌ చేసుకుని రుణమాఫీ వస్తుందని రుణాలు ఇప్పించారు. మరి కొంత మంది నిరక్షరాస్యులతో మాట్లాడి వారికి ప్రత్యేక పొదుపు సంఘాలు ఉన్నప్పటికీ, మీకు ఒక్కొక్కరికి రూ.5,000 రుణాలు ఇప్పిస్తామని, తిరిగి కట్టవలసిన అవసరం లేదని నమ్మబలికి, వారి గ్రూప్‌ పేరుతో రూ. 10 లక్షలు రుణాలు పొంది అనుకున్న ప్రకారం రూ.5 వేలు ఇచ్చి పంపారు. ఈ తతంగంలో మెప్మాలో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో పాటు బ్యాంక్‌ అధికారుల హస్తం కూడా ఉంది. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో 11 గ్రూప్‌లకు కలిపి సుమారు కోటి 15 లక్షల రూపాయల లింకేజీ రుణాలు తీసుకున్నారు. ఇలాగే మరికొన్ని బ్యాంకులలో కూడా రుణాలు పొందారు. తిలా పాపం తలా పిడికెడు అన్న రీతిగా నిరక్షరాస్యులు అయిన గ్రూప్‌ మహిళలను ఏమరపాటుకు గురి చేసి ఒక్కొక్క గ్రూపుకి రూ.10 లక్షలు, కొన్ని గ్రూప్‌లకు రూ.20 లక్షలు, మరి కొన్ని గ్రూపులకు రూ.6 లక్షలు రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాలు చెల్లించకపోవటం ఎన్నిసార్లు ఆర్పీలకు ఫోన్‌ చేసినా స్పందించక పోవటంతో గ్రూపు సభ్యుకు నోటీసులు పంపటంలో అక్రమాలు వెలుగు చూశాయి. ఒకే మహిళా సంఘం పేరు జీడిసిసి బ్యాంకులోనూ, కెనరా బ్యాంకులోనూ ఉంది. ఒక బ్యాంకులో ఉన్న గ్రూపు మహిళల ఫోటోలకు, పేర్లు, చిరునామాలకు పొంతన లేకుండా ఉంది. నిజాంపట్నం, తాడేపల్లి, భీమవరం, అనకాపల్లి మరికొన్ని రూరల్‌ ప్రాంతాల చిరునామాలు, రేపల్లె పురపాలక సంఘంలో ఉన్న స్వయం సహాయక గ్రూపుల్లో ఉండటం విస్తుగొలుపుతోంది. ఉదాహరణకు జీడీసీసీ బ్యాంకు రేపల్లె శాఖలో రోషిణి, అప్సరా, అప్సని, షాహీన, బిస్మిల్లా, రామకృష్ణ, శ్రీనాగేశ్వరి, తేజ, జరీనా, ఫైజుల్లా, మహిళ పొదుపు సంఘాల పేర్లు ఉన్నాయి. కెనరా బ్యాంకులో తేజ స్వయం సహాయక సంఘానికి మూడు విడతల్లో ఆసరా పథకం కింద రూ.39,766 రుణమాఫీ డబ్బులు పడ్డాయి. అలాగే అప్సరాకు రూ.1,12,191, బిస్మిల్లా గ్రూపుకనకు రూ.1,20,500, రామకృష్ణ గ్రూపునకు రూ.1,67,943 రోషిణి గ్రూపునకు రూ.1,48,756 రుణమాఫీ ఆసరా పథకం కింద అందాయి. అయినా జీడీసీసీ బ్యాంకు సిబ్బంది మాత్రం తమకు ఏమీ తెలియదని, మెప్మా వారు అటెస్టెడ్‌ చేశారు కాబట్టి రుణాలు మంజూరు చేశామని తెలిపారు.
మెప్మా సీఎంఎం వివరణ
ఆర్పీలు అక్రమాలకు పాల్పడిన ఘటన వాస్తవమేనని సిఎంఎం వివరించారు. ఇప్పటికే ఇద్దరు ఆర్పీలను విధులకు దూరంగా ఉంచినట్లు తెలిపారు.
జీడీసీసీ బ్యాంకు మేనేజర్‌ వెంకటరమణ వివరణ
తప్పుడు పత్రాలతో ఆర్పీలు రుణాలు పొందిన మాట వాస్తవమేనని అన్నారు. రికవరీ చెయ్యకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెప్మా సిబ్బంది రుణాలు పొందే వారి దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయకపోవటం వలన తప్పు జరిగిందని అన్నారు.