Mar 27,2023 19:26

వైయస్సార్‌ ఆసరా పథకం చెక్కును విడుదల చేస్తున్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి

డ్వాక్రా మహిళా సంఘాలు ప్రభుత్వానికి అండగా నిలవాలి

-ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్‌

డ్వాక్రా సంఘాల మహిళలు వైసిపి ప్రభుత్వానికి అండగా ఉండాలని శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పార్నపల్లి గ్రామంలో టిటిడి కళ్యాణ మండపంలో వైయస్సార్‌ ఆసరా పథకం మూడో విడత చెక్కు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్న ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలన్నారు. మండలంలో 773 డ్వాక్రా మహిళా సంఘాలకు రూ 4 కోట్ల 92 లక్షల 941ల చెక్కును విడుదల చేశారు. ప్రతి కుటుంబం ప్రభుత్వ ప్రతిఫలాలను పొందేలా ఈ సంక్షేమ క్యాలెండర్లను రూపొందిం చడం జరిగిందన్నారు. ప్రతిపక్ష నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలంటే ముఖ్యమంత్రి జగన్‌కు అండగా ఉండాలని ఆయన కోరారు. డిఆర్‌డిఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గంలోని డ్వాక్రా సంఘాలకు పెద్ద మొత్తంలో ఆసరా నిధులు రావడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాల్లో నంద్యాల జిల్లానే మొదటి స్థానంలో ఉందని, బ్యాంకు రికవరీలోనూ ప్రథమ స్థానంలోనే ఉందని తెలిపారు. మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు డి చిన్న సంజీవరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రభుత్వ నిధులే కాకుండా తన సొంత నిధులతోనూ ప్రజలకు సేవ చేయడంలో మొదటి స్థానంలో ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డికి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేసు వెంకటరామిరెడ్డి, సర్పంచ్‌ జెడ్పిటిసి సభ్యురాలు బారెడ్డి తులసమ్మ, మాజీ జెడ్పిటిసి చిన్న మద్దిలేటి, రైతు సంఘం సలహా మండల అధ్యక్షుడు కృష్ణ, మల్లారెడ్డి, వెలుగు ఏపీఎం రాజశేఖర్‌ రెడ్డి, తహశీల్దార్‌ ఉమారాణి, డ్వాక్రా సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.