Jul 13,2023 21:47

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్‌/ముసునూరు

లారీ ఢకొీని ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన బుధవారం పెదవేగి మండలం జానంపేట సమీపంలో జరిగింది. మృతుల్లో ఒకరు ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి పెదవేగి ఎస్‌ఐ ఎం.లక్ష్మణ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముసునూరు మండలం యల్లాపురానికి చెందిన జున్నూరి బాలకృష్ణ, తాడిగడప రాజాగణేష్‌ టాటాఏస్‌ వాహనంలో తమ్మిలేరునుంచి ఇసుకను ఏలూరుకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున టాటాఏస్‌ వాహనంలో ఇసుకను తీసుకుని ఏలూరుకు బయలుదేరారు. జానంపేట వద్దకు రాగానే ఎదురుగా టిప్పర్‌ అతివేగంగా వచ్చి వీరి వాహనాన్ని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో టాటాఏస్‌ వాహనంలో ఉన్న తాడిగడప రాజాగణేష్‌(22), జున్నూరి బాలకష్ణ(27) అక్కడికక్కడే మృతిచెందారు. లారీ అతివేగానికి ఇద్దరూ టాటాఏస్‌ క్యాబిన్‌లో చిక్కుకుని ప్రాణాలొదిలారు. వీరి మృతదేహాలను స్థానికుల సాయంతో బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలకృష్ణకు భార్య, ఏడాదిన్నర, ఏడునెలల ఇద్దరు ఆడపిల్లలున్నారు. రాజాగణేష్‌ పెదవేగి మండలం దుగ్గిరాలలోని ఏలూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో బిటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వీరి మృతితో రెండు కుటుంబాలలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ లక్ష్మణ్‌ తెలిపారు.