భీమడోలులో పట్టాలపై నిలిచిన బొలెరోను ఢకొీన్న రైలు
తునాతునకలైన బొలేరో వాహనం
ఇంజిన్ ముందు భాగం దెబ్బతిని 5 గంటలు నిలిచిన రైలు
పోలీసులు వెంబడిస్తున్న బొలేరో ఇదేనని అనుమానాలు
ప్రజాశక్తి - భీమడోలు/ఉంగుటూరు
భీమడోలు రైల్వే గేటు వద్ద పట్టాలపై నిలిచిన బొలేరో వాహనాన్ని సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్సెప్రెస్ ఢకొీన్న ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ గురువారం తెల్లవారుజామున సుమారు 2.14 గంటలకు భీమడోలు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లనున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం జాతీయరహదారి నుంచి భీమడోలు జంక్షన్‌కు వెళ్లే మార్గంలోని రైల్వేగేటు వేశారు. సరిగ్గా అదే సమయంలో 216వ జాతీయరహదారిపై నుంచి బొలెరో వాహనం అతివేగంగా గేటును ఢకొీట్టి పట్టాలపైకి వెళ్లి ఆగిపోయింది. సరిగ్గా అదే సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్ రావడంతో బొలెరోలోని వారంతా వాహనం దిగి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న రైలు తాకిడికి బొలెరో తునాతునకలైంది. దీంతో రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతినడంతో రైలు అక్కడే నిలిచిపోయింది. రైలులోని ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. దెబ్బతిన్న రైలు ఇంజిన్‌ను బోగీల నుంచి తొలగించి వేరే ఇంజిన్ అమర్చి ఉదయం 8.48 నిమిషాలకు రైలును విశాఖపట్నం పంపారు. సుమారు ఆరున్నర గంటలసేపు రైలు నిలిచిపోవడంతో దానిలోని ప్రయాణికులు పలువురు జాతీయ రహదారిపైకి చేరుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. సంఘటనా సమాచారం తెలుసుకున్న వెంటనే రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
పోలీసులు వెంబడించడంతో..!
జాతీయ రహదారిపై ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వైపు వస్తున్న బొలెరో వాహనాన్ని అనుమానంతో హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంబడించినట్లు తెలుస్తోంది. దీంతో బొలెరోలోని వారు భయంతో తప్పించుకునే క్రమంలో గేటును ఢకొీట్టినట్లు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో లభ్యమైనా ఆధారాలతో రైల్వేపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










