Jul 15,2021 06:53

ఇప్పటికే రాష్ట్ర విద్యా రంగంలో బాలారిష్టాలు కొనసాగుతున్నాయి. వాటిని పరిష్కరించకపోగా... నూతన విద్యా విధానాన్ని దేశం మొత్తం మీద ప్రప్రథమంగా అమలుచేసేందుకు ఉవ్విళ్లూరుతోంది మన రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా సర్క్యులర్‌ (నెం:172 తేదీ 31.05.21) విడుదల చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న పాఠశాల 10+2 విద్య నిర్మాణం 5+3+3+4గా మార్పును ప్రతిపాదించారు. అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాల వ్యవస్థను 3 అంచెలుగా మార్పు చేస్తున్నారు. ఈ విధానంలో అంగన్‌వాడీ కేంద్రాలు వైఎస్‌ఆర్‌ ప్రాథమిక పాఠశాలలుగా రూపాంతరం చెందుతాయి. 3,4,5 తరగతులు 3-5 కి.మీ దూరంలో వున్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. పాఠశాలల వికేంద్రీకరణకు భిన్నంగా కేంద్రీకరణ చేయనున్నారు. అంటే పిల్లలకు బడి దూరం కాబోతుంది.

గ్రామీణ పరిస్థితులు
గత రెండేళ్లుగా కరోనా కష్టకాలంతో వున్న ఉపాధులు కూడా పోయాయి. పెద్ద పరిశ్రమలు మూతపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వీటన్నింటి ప్రభావంతో జీవితాలు ఛిద్రమవుతున్నాయి. ఇటువంటి గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు 3 కి.మీ దూరంలో గల ఉన్నత పాఠశాలలకు చిన్నారులను పంపించడమంటే జరిగే పని కాదు. 5 కి.మీ నుండి 10 కి.మీ దూరంలో కూడా పాఠశాలలు వున్నాయి. 'మా ఊరిలో బడి ఎందుకు మూసేయాలా? మాలాంటి పేదోళ్లకేనా ఈ కష్టాలు?' అనే చర్చ కూడా జరుగుతోంది. ఆ ఊరి బడికి పిల్లలను సక్రమంగా పంపించే పరిస్థితులు లేవు. కొంతమంది విరామ సమయంలో ఇళ్లకు వెళ్లి చద్దిబువ్వ తిని వస్తారు. ఉన్న బడిని వేరే ఊరికి పంపటం దేనికి?

గుణాత్మకమైన, నాణ్యమైన విద్య, డిజిటల్‌ విద్య, ఆంగ్ల విద్య కోసమే ఈ సంస్కరణలని...ముఖ్యమంత్రి చెప్పే మాటలు వినసొంపుగా ఉండవచ్చు. వీటి ప్రయోజనాలు ఎవరి కోసం అనేది ప్రపంచ బ్యాంకు ఒప్పందం బట్టబయలు చేసింది. రూ. 1875 కోట్ల అప్పు కోసం ఈ మాటలు చెప్పి... నూతన విద్యా విధానం అమలును అడ్డం పెట్టుకుని తెచ్చే ఈ ఉత్తర్వులు...ప్రజల ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేస్తున్నాయి. ఇదే సందర్భంలో ఒక్క పాఠశాల కుడా మూత పడదని, ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాడని, ఒక్క టీచర్‌ పోస్టు కూడా తగ్గదని చెప్తున్నారు. పాఠశాల భవనం అక్కడే వుంటుంది. కాకపోతే ప్రాథమిక పాఠశాల తరగతులు ఉండవు. ఆ పిల్లలు ఉండరు. దీనిని ఏమంటారు? మూతపడటం కాదా? 3 కి.మీ నుండి 5 కి.మీ దూరంలో వుండే పాఠశాలకు ప్రయాణం చేయడం సాధ్యమా? దీనివలన డ్రాపవుట్ల రేటు పెరుగుతుంది. బాలికలు చదువుకు మరింత దూరం అవుతారు. విద్యారంగానికి నిధులను పెంచి, సౌకర్యాలను కల్పించి ఇప్పుడున్న పాఠశాలలను బలోపేతం చేస్తే గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల పిల్లలందరికీ చదువుకునే అవకాశం కల్పించబడుతుంది.

రాజ్యాంగ విరుద్ధం
ప్రతి పౌరునికి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని రాజ్యాంగం లోని 86వ అధికరణం చెబుతుంది. 2009లో విద్యాహక్కు చట్టం మరింత ఉత్కృష్టంగా ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని, అమలు చేయకపోతే శిక్షార్హులని చెప్పింది. ప్రతి కి.మీ దూరంలో పాఠశాలలు వుండాలని ఉటంకించింది. అయితే నూతన విధానంలో 3-5 కి.మీ దూరంలో పెడతామంటున్నారు. ఇలా అయితే ప్రభుత్వమే శిక్షార్హురాలు. చట్టాలు తెచ్చిన ప్రభుత్వాలే వాటికి తూట్లు పొడుస్తున్నాయి. ఇంత వరకు పట్టణ కేంద్రాలలో పెద్ద సంఖ్యలో ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లు ఉండగా, ఇప్పుడవి కాస్త అదును చూసి గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తాయి.

కార్పొరేట్లకు అప్పగించడానికే
గ్రామాలలో ప్రీప్రైమరీ స్కూళ్లు మాత్రమే ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలు వుండవు. 53 వేల టీచర్ల పోస్టులు రద్దు కాబడతాయి. శిక్షణ పొందిన అభ్యర్థులకు ఉద్యోగాలు రావు. బడుల కేంద్రీకరణ కారణంగా రేషనలైజేషన్‌లో పోస్టులు కుదించబడతాయి. కాంప్లెక్సు స్థాయి వ్యవస్థలో ధార్మిక సంస్థల జోక్యం పెరుగుతుంది. మాతృభాష బోధన కనుమరుగవుతుంది. అంగన్‌వాడీ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. హైస్కూళ్లలో సమాంతర మీడియంలు వుండవు. ఈ పరిణామాలన్నీ ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీవ్రంగా బలహీన పరుస్తాయి. ఈ సమయం కోసమే కార్పొరేట్‌ సంస్థలు ఎదురు చూస్తున్నాయి. వాటికనుగుణంగా పాలకులు శృతి కలుపుతున్నారు.

పాఠాలు నేర్వరే?
2015-16 విద్యా సంవత్సరంలో గిరిజన విద్యారంగంలో సంస్కరణలు తెచ్చారు. గిరిజన గ్రామాల్లో వున్న పాథమిక పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులను ఆశ్రమ ఉన్నత పాఠశాలలకు తరలించారు. వేల మంది విద్యార్థులు డ్రాపవుట్‌ అయ్యారు. అసలే గిరిజన ప్రాంత అక్షరాస్యత అంతంత మాత్రం. ఈ విధానం మరింత నిరక్షరాస్యతను పెంచింది. సక్సెస్‌ పాఠశాలలుగా మార్పు చేసినప్పుడు వేల సంఖ్యలో ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడ్డాయి. అపుడు కూడా డ్రాపవుట్లు పెరిగాయి. కొంతమంది ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. 10 మంది విద్యార్థులు ఉండే వందలాది పాఠశాలలను మూత వేశారు. ఆ సందర్భంలో విద్యార్థులు బడికి దూరమవుతారనే అంచనా వున్నప్పటికీ సంస్కరణలను వేగవంతం చేస్తున్నారు. దేశంలో ఇప్పటికే అక్షరాస్యతలో వెనుకబడిన రాష్ట్రంగా 28వ స్థానంలో ఉంది. ఇలాంటి సంస్కరణలు మరింత దిగజారుస్తాయి. చారిత్రక అంశాలన, విద్యా హక్కు చట్టాలను విస్మరించడం సరి కాదు.

ప్రజా చేతన్యంతోనే ప్రభుత్వ విద్య
పాలకుల వంకర ఆలోచనలకు సమాధానం ప్రభుత్వ విద్యను రక్షించుకునే ప్రజల చైతన్యమే. ఎంత ప్రైవేటుపరం చేస్తున్నా 70 శాతం పైచిలుకు ప్రభుత్వ విద్యను అభ్యసిస్తున్నారు. అనేక ఆటంకాలను అధిగమించి, ఎన్ని సమస్యలు చుట్టిముట్టినా సరే సామాజిక బాధ్యతలను, పని సంస్కృతిని, విలువలను ప్రతిబింబించే విధంగా వ్యవహరించడం వల్లనే ఇప్పటికీ ప్రభుత్వ విద్యారంగం తల్లిదండ్రుల, విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంది. ఇప్పటి వ్యవస్థను బలోపేతం చేయాలి. రాష్ట్ర ప్రజలను కాపాడగలిగేది విద్యారంగమే. పిల్లలందరూ విద్యావంతులైతే అటు సేవారంగం, ఇటు ఉత్పత్తి రంగాలలో రాణిస్తారు. అసలు చదువుకే దూరమైతే పక్కదారి పడతారు. ఇది సమాజ అభివృద్ధికి ఆటంకంగా తయారౌతుంది. ఇన్ని నష్టాలకు కారణమవుతున్న నూతన విద్యా విధానానికి, జీఓ నెం. 172కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు సిద్ధపడాలి. ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకోవాలి.

వ్యాసకర్త
కె . విజయగౌరి
సెల్‌ : 8985383255