మురుగునీటితో నిండిపోతున్న పెద్దచెరువు
డ్రైనేజీ నీరు మళ్లింపునకు కానరాని చర్యలు
హామీలకే పరిమితమైన ట్యాంక్‌బండ్ తరహా అభివృద్ధి
చిల్లపేట, చిట్టివలస ప్రాంతీయుల ఆవేదన
ప్రజాశక్తి -తగరపువలస : స్థానిక చిల్లపేట, చిట్టి వలస పెద్ద చెరువు నుంచి దుర్గంధం వస్తుండడంతో చెరువుకు ఆనుకుని ఉన్న పెరికివీధి, చిట్టివలస ప్రాంతాల్లో నివాసితులు నానా అవస్ధలు పడుతున్నారు.
గతానికి భిన్నంగా చుట్టూరా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఇష్టారీతిన ఈ ప్రాంతంలో ఎక్కడికక్కడే జరిగిన అపార్ట్‌మెంట్ల నుంచి మురుగునీరు మళ్లే వీలు లేక ఈ పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిట్టివలస, తగరపువలస పట్టణ శివారు ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు నేరుగా ఇదే చెరువులోకి విడిచి పెట్టడం వల్ల దుర్గంధ సమస్య ఎప్పటి నుంచో స్థానికులను పట్టి పీడిస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. చెరువులోంచి నీరు బయటకు వెళ్లేందుకు మదుము, చప్టా ఉన్నప్పటికీ, చెరువులోకి చేరే నీరంతా బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో రోజుల తరబడి డ్రైనేజీల నుంచి చేరిన నీరు నిల్వ ఉండి, మురిగి దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు.
మురుగునీటిని శుద్ధి చేసే ప్రక్రియ లేనందునే?
మురుగునీటిని శుద్ధి చేసే సాంకేతికతతో కూడిన పరికరాలను ఇక్కడ నెలకొల్పాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నప్పటికీ, ఆచరణలో అమలు జరగకపోవడం వల్లే దుర్గంధ సమస్య ఉత్పన్నమౌతోందని స్థానికులు అంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల వైఫల్యమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిధుల లభ్యత సమస్యతో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చడం లేదని ఆరోపణలున్న నేపథ్యంలో జివిఎంసి నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేసి మురుగు నీరు శుద్ధి చేసే ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అపుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.మరోవైపు ఈ ప్రాంతంలోని మురుగునీరు డ్రైనేజీల ద్వారా చెరువులోకి మళ్లించకుండా, ప్రత్యామ్నాయ మార్గాలలో బయటకు పంపాలని స్థానికులు కోరుతున్నారు.
ప్లాట్లుగా మారిన పంటపొలాలు
సుమారు 36 ఎకరాల విస్తీర్ణం గల ఈ చెరువుకు కింద కొన్నాళ్ల క్రితం వరకు ఆయకట్టు ఉండేది. నగరీకరణ ప్రభావంతో కాలక్రమేణా పంటపొలాలన్నీ మాయమై, వాటిస్థానంలో ప్లాట్లు, బహుళ అంతస్తుల భవనాలు వెలిసాయి. అయితే ఆయా భవనాల నుంచి మురుగు, వాడిక నీరు మళ్లించేందుకు సరిపడా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటులో నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే అనివార్యంగా డ్రైనేజీ నీరంతా చెరువులోకి చేరవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని స్థానికులు అంటున్నారు. భవనాల నుంచి మురుగునీటిని చెరువులోకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వేరేవైపు మళ్లిస్తే దుర్గంధ సమస్య నుంచి స్థానికులకు విముక్తి లభిస్తుందని అంటున్నారు. మరోవైపు చెరువులో చేపల పెంపకానికి వేస్తున్న దాణా కూడా దుర్గంధ సమస్యకు కారణమన్న ఆరోపణ ఉంది.
ప్రకటనలకే పరిమితమైన పర్యాటకాభివృద్ధి
చిట్టివలస పెద్ద చెరువును ట్యాంక్ బండ్ తరహాలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు చేసిన ప్రకటనలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. రూ.1.98కోట్లతో చెరువు తూర్పు గట్టు పటిష్టవంతం, అభివృద్ధి పనులకు అప్పటి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు 2018 డిసెంబర్ ఒకటిన శంకుస్థాపన చేశారు. గట్టు ఎత్తయితే పెంచారు, కానీ టాంక్ బండ్ తరహాలో పర్యాటకాభివృద్ధి చేస్తామన్న నాటిమంత్రి గంటా హామీ మాత్రం పూర్తి కాలేదు. ఇంతలోనే రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పర్యాటకమంత్రిగా పదవి దక్కించుకున్న స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా అదే తరహాలో హామీ ఇచ్చారు. మూడేళ్లపాటు మంత్రి పదవిలో కొనసాగి, ప్రస్తుతం మాజీ అయినప్పటికీ, ఎమ్మెల్యేగానైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో ముత్తంశెట్టి మాట అమలుకు నోచుకోక చెరువు అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండిపోయింది. మరి నేతలు హామీలు ఎప్పటికి అమలుకు నోచుకుంటాయో, పర్యాటకాభివృద్ధి పక్కనబెడితే, ఈ దుర్గంధం సమస్య నుంచి తమకు ఎపుడు విముక్తి లభిస్తుందోనని ఈ ప్రాంతీయులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
చెరువును టాంక్ బండ్ తరహాలో పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. తద్వారా దుర్గంధ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా కృషి చేయాలి.
ఎం శంకరరావు, చిట్టి వలస
దుర్వాసనతో ఇబ్బందులు
దుర్వాసనతో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి భోజనం కూడా సహించని పరిస్థితి. చెరువులోని మురుగు నీరు బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలి. చెరువును అభివృద్ధి చేయాలి.
మాకాల రామాయమ్మ, చిట్టివలస










