ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ అమ్మవారి భవానీ దీక్షా విరమణ మహాోత్సవాలు రెండో రోజు శుక్రవారం భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ఈనెల 15 తేదీ గురువారం నుండి 19వ తేదీ వరకూ (ఐదు రోజుల పాటు) అత్యంత వైభవోపేతంగా జరుగనున్న భవానీ దీక్షల విరమణ రెండో రోజు శుక్రవారం 60 వేల మంది భవానీలు విజయవాడ నగరానికి చేరుకుని గిరిప్రదక్షిణ అనంతరం దుర్గమ్మను తెల్లవారుజాము 3 గంటల నుంచే అమ్మవారిని దర్శించుకుని హాోమగుండంలో మొక్కలు తీర్చుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ తెలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చే భవానీ భక్తుల కోసం దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన నేపధ్యంలో భవానీ దీక్షల మాల విరమణకు వచ్చే భవానీలు దుర్గగుడి టోల్ గేట్ నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభించి కుమ్మరిపాలెం, విద్యాధరపురం, కబేళా రోడ్డు మీదుగా మిల్క్ ప్రాజెక్ట్, చిట్టినగర్, బ్రాహ్మణ వీధి గుండా దేవాలయానికి చేరుకుంటున్నారు. అనంతరం క్యూ మార్గం ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకుని దుర్గమ్మను దర్శించుకుని, మెట్ల మార్గం ద్వారా మహామండపం వైపుకు చేరుకుంటున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన మూడు హాోమగుండాల్లో నేతి కొబ్బరి కాయలను వేసి తమ తమ మొక్కుబడులను తీర్చుకుంటున్నారు. అనంతరం దేవస్థానం వారు ఏర్పాటుచేసిన భోజనాల్లో పలువురు పాల్గొంటున్నారు. రూ.100, 300, 500ల దర్శన టికెట్లు ద్వారా సుమారు రూ. 9 లక్షలు ఆదాయం రాగా, మూడు లక్షల ఇరవై వేల లడ్డూలు భక్తులు కొనుగోలు చేయగా, సుమారు 18 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు ఆలయ అధికారులు వివరించారు.










