Feb 25,2023 22:43

ప్రజాశక్తి -వన్‌టౌన్‌ 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానం ఇంద్రకీలాద్రి ఆలయంలోని వివిధ విభాగాలు, కౌంటర్లను ఆలయ పాలకమండలి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, పాలకమండలి సభ్యులు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, భక్తులతో మాట్లాడి ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా నాగపుట్ట వద్ద ఉన్న ప్రసాదం కౌంటర్‌, ఆర్జిత సేవ కౌంటర్‌, దర్శనం క్యూ లైన్‌లు, తాగు నీరు ఏర్పాటు, ప్రసాదం తయారీ, 6వ అంతస్తులోని మెయిన్‌ స్టోర్‌ను పరిశీలించారు. ప్రసాదం తయారీ కేంద్రం వద్ద ప్రసాదం ముడి సరుకులు, నాణ్యత, బరువు, శానిటేషన్‌ పరిశీలించారు. టెండర్‌ శాంపిల్స్‌ ప్రకారమే ప్రసాదం తయారీ ముడి సరుకులు ఉండాలని తెలిపారు. ప్రసాదం తయారీ, పంపిణీ పర్యవేక్షణకు పాలకమండలి సభ్యులు చింకా శ్రీనివాస్‌ని నియమించామని చైర్మన్‌ తెలిపారు. అర్చకులతో మాట్లాడి వారి సలహాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భక్తులతో మర్యాదగా నడుచుకోవాలని తెలిపారు. అమ్మవారి ఆలయం వద్ద క్యూలైన్లో ఉన్న భక్తులతో మాట్లాడి దర్శనం మరియు ఇతర ఏర్పాట్లు గురించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులు సంతప్తిని వ్యక్తపరిచారు.
ఉచిత కంటి పరీక్ష శిబిరం ప్రారంభం :
మహామండపం ఏడవ అంతస్తు నందు ఈరోజు ధర్మపదం వేదిక నందు ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు భక్తులు ఈ ఉచిత కంటిపరీక్ష శిబిరాన్ని వినియోగించుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు కట్టా సత్తయ్య, బచ్చు మాధవీ కష్ణ, బుద్దా రాంబాబు, చింకా శ్రీనివాసులు, ఆలయ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.