Nov 13,2023 22:08

జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌ను ఆశీర్వదిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో దీపావళి పండుగ శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఆదివారం దేవాలయంలో దీపావళి సందర్భంగా పూజాధికాలు నిర్వహించి దీపాలంకరణ చేశారు. అనంతరం చైర్మన్‌ కర్నాటి రాంబాబు దంపతులు టపాసులు కాల్చి దీపావళి పండుగ నిర్వహించారు. దీపావళి సందర్భంగా ఆదివారం శ్రీ అమ్మవారి ప్రధానాలయంలో సాయంత్రం 5 గంటలకు ధనలక్శ్మి పూజ (దేవస్థానం తరపున మాత్రమే) శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ అమ్మవారికి పంచహారతులు సేవ నిర్వహించిన అనంతరం సాయంత్రం 7 గంటలకు ప్రధానాలయ, ఉపాలయములు కవాటబంధనం (తలుపులు మూసివేశారు) చేశారు. శ్రీ అమ్మవారి ప్రధానాలయం, ఉపాలయాలు, ప్రాంగణములన్నీ దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబు దంపతులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొని దీపములు వెలిగించి బాణసంచాలు వెలిగించారు. మరలా తిరిగి 13వ తేదీ సోమవారం ఉదయం యధావిధిగా శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు.
దుర్గమ్మను దర్శించుకున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌
దీపావళి పండుగను పురస్కరించుకుని శ్రీ దుర్గమ్మ దర్శనానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సంపత్‌ కుమార్‌ కుటుంబ సభ్యులతో ఆదివారం విచ్చేశారు. ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్‌ కెవిఎస్‌ కోటేశ్వరరావు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్‌తో పాటుగా ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి పి చంద్రశేఖర్‌ ఉన్నారు.
దుర్గమ్మ దర్శనార్థం విచ్చేసిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి
శ్రీ అమ్మవారి దర్శనార్థం మధ్యప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వెంకటరమణ దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం విచ్చేశారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్‌ కెవిఎస్‌ కోటేశ్వరరావు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.