Dec 20,2020 08:30

      ఫ్రికాలో కోతుల్ని పట్టుకోడానికి ఒక వినూత్న విధానాన్ని అవలంభిస్తారు. కోతి చెయ్యి పట్టేంత సన్న మూతి గల సీసాలో... కోతులు బాగా ఇష్టంగా తినే గింజలు వేసి, ఆ సీసాలను చెట్లకు కడతారు. ఆ సీసాలోని గింజల కోసం వచ్చిన కోతులు, ఆత్రంగా ఆ సీసాలో చెయ్యి పెట్టి గుప్పెట నిండా ఆ గింజలను పట్టుకుంటాయి. గుప్పెట నిండా గింజలతో బిగించిన పిడికిలిని సీసా మూతి నుండి బయటికి లాగేందుకు ప్రయత్నిస్తాయి. ఎంత లాగినా దాని చెయ్యి బయటకి రాదు. అలాగని చేతిలోని గింజలను వదిలేయదు. ఆ కోతి పారిపోవాలంటే... చేతిలోని గింజలను వదిలేయాలి. దానికెంత ఆశ అంటే.... తన గుప్పెట్లోని గింజలను వదలలేనంత పేరాశ. చివరకు దాని పేరాశతో అది దొరికిపోతుంది. అంటే... ఆ గింజల కోసం తన ప్రాణం మీదకైనా తెచ్చుకుంటుంది తప్ప, ఆశపడినదాన్ని మాత్రం వదులుకోడానికి ఇష్టపడదు. ఇది కోతి బుద్ధి. అంటే... ఈ కోతి ఎంత తెలివైనదో... ఈ అంబానీలు, అదానీలు కూడా అంతే తెలివైన వారు.
       తమకున్న ఆస్తిపై విచ్చలవిడిగా లాభాలు పెరుగుతూనే వుంటాయి తప్ప తరిగేవి కావని, పెట్టుబడిదారులకు తెలుసు. డబ్బుకి అయస్కాంత తత్వం వుంది. ఒక సామాన్యుడి దగ్గర పది వేలు డబ్బు వుంటే... దానికి మరో పది వేలు కలపాలంటే.... చమటలు చిందించాలి. రక్తం ధారబోయాలి. కానీ... కోటి రూపాయలున్న వ్యక్తి... దానికి మరో కోటి రూపాయలను జమ చేయడం చాలా సులభం. డబ్బుకి, పెట్టుబడిదారుడికి మధ్య వున ఆకర్షణ... అయస్కాంతం - ఇనుప ముక్క సూత్రం మాదిరిగానే వుంటుంది. అలాగే పెట్టుబడిదారుని దగ్గరున్న డబ్బు కూడా పెరుగుతూనే వుంటుంది. ఈ క్రమంలోనే పెట్టుబడిదారులందరూ లాభాల కోసం పోటీ పడతారు. పోటీలో ఎవరు నిలదొక్కుకుంటే వారే పైకి వెళతారు. ఇక్కడ పెట్టుబడిదారుడు... తాను ఇంకొకడ్ని తొక్కేయడమో, లేదా ఇంకొకడు తననే తొక్కేడమో జరుగుతుంది తప్ప వేరే మార్గం లేదు. 'కష్టపడి పైకొచ్చినోళ్లు వుంటారు. సులువుగా పైకొచ్చినోళ్లు వుంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో... మూడో రకం. జనాన్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం. బతకడం ఇష్టం... ఎలాగైనా... దాచుకోడం ఇష్టం. లాక్కోవడం ఇష్టం...' అన్నది ఒక పాపులర్‌ సినిమా డైలాగ్‌. పెట్టుబడిదార్ల నైజం ఇలాగే వుంటుంది. ఎదుటివాడికి ఇష్టం వున్నా లేకపోయినా... ఎదుటివాడ్ని తొక్కేసుకుంటూ పైపైకి వెళ్లాల్సిందే. లేదంటే... తనకంటే పెద్దవాడెవడో తనను తొక్కేసి పైకి వెళతాడు. ఆ భయం ప్రతి పెట్టుబడిదారుడ్ని వెంటాడుతూంటుంది. 'తాడిని తన్నేవాడుంటే, వాడి తల తన్నేవాడు ఇంకొకడు వుంటాడ'న్న సామెత ఒకటుంది. ఇక్కడ తన తల తన్నేవాడ్ని ఇంకొకడ్ని ఎదగనీయకుండా చూసుకుంటాడు. ఈ క్రమంలో తాను ఎంత సుఖపడుతున్నాడనేది ఆలోచించే పరిస్థితి వుండదు. ఎంత సంపాదించినా.. ఇంకా ఇంకా సంపాదించాలనే అనుకుంటాడు. ఈ పరుగు పందెంలో తననెవరూ దాటి పోకుండా వుండేందుకు ఎదుటివాడ్ని ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. అవసరమైతే... తన సుఖశాంతులను సైతం ఫణంగా పెడతాడు.
   ధీరూబాయ్ అంబానీ 36 కోట్లు సంపాదించడానికి చాలా కష్టపడి వుండొచ్చు. కాని వారి పిల్లలు చాలా సునాయాసంగా లక్షల కోట్ల లోకి వచ్చేశారు. బ్యాంకులు కూడా వారికే అప్పులు ఇస్తాయి. ఆరుగాలం కష్టించి కడుపు నింపే రైతు... ఒక ఏడాది అప్పు కట్టకపోతే, తిరిగి అప్పు ఇవ్వకపోగా, వాడి ఆస్తి వేలం వేయడానికి సిద్ధపడతాయి బ్యాంకులు. అందుకే అంటాడు మార్క్స్‌... 'పెట్టుబడిదారీ సమాజం తలకిందులుగా వుంది' అని. అప్పు అయినా, అప్పు మాఫీ అయినా, కరోనా నష్టపరిహారం అయినా, ఉద్దీపన ప్యాకేజీ అయినా... పెట్టుబడిదారుడ్నే వరిస్తాయి. ఎందుకంటే వారి దగ్గర డబ్బు అనే అయస్కాంతం వుంది. అంతెందుకు... రైతుల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసినా మోడీ... రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలు చేశాడంటే... కార్పొరేట్లను సంతోషపెట్టడానికే తప్ప..మరొకటి కాదు. వారు సంతోషంగా లేకపోతే, వాళ్లు చెప్పినట్లు చేయకపోతే, వాళ్లకి నమ్మిన బంటులా వుండకపోతే ... తన పదవికి గండం అనే విషయం అధికారంలో వున్నవారికి తెలుసు. వీరిది పేరాశ... కార్పొరేట్లది అందినకాడికి దోచుకోవాలనే దురాశ.
     అందుకే కార్పొరేట్ల బుర్ర ఆఫ్రికా కోతిలా వుంటుంది. ఎటొచ్చి కోతిది మూర్ఖత్వం. అది కోతికే నష్టం. కానీ... అంబానీలు, అదానీల వంటి కార్పొరేట్లది దురాశ. అది దేశానికి నష్టం. పర్యావరణానికి, ప్రకృతికి నష్టం. మానవత్వానికి, నీతి నియమాలకు, ప్రజాస్వామ్యానికి, చివరకు రాజ్యాంగానికి కూడా నష్టమే. స్వేచ్ఛకు, మానవ విలువలకు కూడా నష్టం తెచ్చిపెడతారు. కనుక ఈ దురాశాపూరిత పెట్టుబడిదారీ విధానాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే.... మానవ సమాజానికి అంత మంచిది.