May 21,2022 06:22

అనాగరిక సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడి...బ్రిటిషు ప్రభుత్వంతో ఆ దురాచారాన్ని రద్దు చేయించిన సంస్కర్తగా... రాజా రామ్మోహన్ రాయ్ సుపరిచితుడు.
1770ల నాటికి హిందూ రాజుల పాలన అంతరించి ముస్లిం పాదుషాల పాలన కూడా ముక్కలవుతున్నది. ఆంగ్లేయ సామ్రాజ్యం స్థిరపడుతున్నది. ఆంగ్లేయుల రాకతో క్రైస్తవం వ్యాపించి హిందువులకే కాక ముస్లింలకూ పోటీగా నిలిచింది. ఈ పరిస్థితులలో 1772 మే 22న బెంగాల్‌ లోని రాధానగర్‌ గ్రామంలో పూల్‌ ఠాకూరాణి, రమాకాంత్‌ రాయ్  దంపతులకు రామ్మోహన్ రాయ్  జన్మించాడు. రమాకాంత్‌ రాయ్  పూర్వీకులు ముస్లిం పాలకుల వద్ద ఉద్యోగాలు చేశారు. రారు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే పూర్తి చేసి బెంగాలీతో పాటు పార్శీ భాషను కూడా నేర్చుకున్నాడు. ముస్లిం రాజుల వద్ద పని చేస్తున్న తండ్రి...రారుని ఉన్నత చదువుల కోసం పాట్నా పంపాడు. అక్కడ అరబ్బీ నేర్చుకున్నాడు. ఖురాన్‌ చదివాడు. తత్వవేత్తల రచనలు చదివాడు. దాంతో రాయ్లో తార్కిక శక్తి పెంపొందింది. పదహారేళ్ల వయసులోనే హిందూ మతం లోని విగ్రహారాధన, ఇతర మూఢాచారాలపై పరిశోధనాత్మక గ్రంథం రాయడానికి రారు పూనుకున్నాడు. ఈ విషయం తెలిసిన తండ్రి కొడుకు మీద కోపించి హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో రారుని ఇంటి నుండి గెంటివేశాడు.
రాజారామ్మోహన్‌ రాయ్  సంచార జీవితంతో ప్రాపంచిక జ్ఞానాన్ని ఆర్జించాడు. మొదట టిబెట్‌ వెళ్లాడు. అక్కడ బౌద్ధమతం వ్యాప్తిలో ఉంది. ఆచరణ కంటే ఆచారాలు, ఆరాధనలు ఎక్కువగా కన్పించాయి. ఇదేమిటని ప్రశ్నించిన రాయ్ అక్కడి లామాల క్రోధానికి గురయ్యాడు. అక్కడి నుండి కాశీ చేరి అక్కడ పండితులను సేవించి సంస్కృతం నేర్చుకుని హిందూ వేదాంతాన్ని అధ్యయనం చేశాడు. మూఢవిశ్వాసాలు ఉండటానికి కారణం అజ్ఞానం అని, అందుకు అవిద్య కారణం అన్నాడు రారు. మూఢ విశ్వాసాలు, అతీంద్రియ శక్తులు, అద్భుతాలు అబద్ధాలని భావించాడు.
ఈస్టిండియా కంపెనీలో రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేశాడు. ఉద్యోగ వ్యాపకంలో భాగల్పూర్‌, రాంనగర్‌, రంగపూర్‌లలో పనిచేశాడు. అక్కడకు వచ్చే ఇంగ్లీషు పత్రికల ద్వారా ఐరోపా రాజకీయాలు తెలుసుకునేవాడు. తర్వాత కలకత్తా వచ్చి నౌకరీతో కాలం వెళ్లబుచ్చడం ఇష్టం లేక ప్రజల్ని వివేకవంతులను చేయాలని సంకల్పించాడు. ''హేతువాదానికి పొసగే విషయాన్ని ఒక పాపాయి చెప్పినా అంగీకరించాలి. బ్రహ్మ అంతటివాడు చెప్పినా హేతువాదానికి సరిపడని అంశాలను ఒప్పుకోకూడదు'' అన్నాడు. రాయ్  తర్వాత వందేళ్ల అనంతరం తెలుగునాట సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆ బాటలో నడవడం మనకు కనపడుతుంది. జనంలో విజ్ఞానాన్ని పెంచి సంఘసంస్కారాన్ని కలిగించే కృషి సాగించాడు. కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. వేదాంత గ్రంథాలు సంస్కృత భాష లోనే ఉండేవి. అలాంటి వాటిని బెంగాలీ, భాషలో రాయడం రాయ్తోనే ప్రారంభమయ్యింది. 1821 లోనే 'కలకత్తా యూనిటేరియన్‌ సంస్థ' రామ్మోహన్‌ రాయ్  మార్గదర్శకత్వంలో ఏర్పడింది. ఏవి విద్య వల్ల కలిగే లాభాలను వ్యాపింపచేస్తాయో...ఏది అజ్ఞానం, మూఢవిశ్వాసం, స్వమత దురాభిమానం, వెర్రి ఆవేశాలను నశింపచేస్తాయో...ఏవి నైతిక సిద్ధాంతాలను పరిశుభ్రపరుస్తాయో...ఏవి విశ్వ వ్యాపకమైన దయనూ, దానగుణాన్ని పెంపొందిప చేస్తాయో... వాటన్నిటినీ నిర్మాణ పరిధిలోకి చేర్చాడు. అసంఖ్యాకమైన పేద ప్రజల పరిస్థితిని మెరుగు పరచటం, ప్రజలకు ఉపయోగకరమైన కళలను ప్రోత్సహించడం, శ్రమించే అలవాటును పెంపొందింప చేసి తద్వారా ప్రజలు, కుటుంబ, సమాజ సౌఖ్యాలను పెంపొందించడం సంస్థ లక్ష్యాలుగా ప్రకటించాడు. రాయ్  ప్రాచీన గురుకుల విధానాన్ని, మత పురాణ సంస్కృత సాహిత్య బోధనను అభిమానించలేదు. 1822లో ఇంగ్లీషు పాఠశాలను ప్రారంభించాడు. ప్రపంచ దేశాల్లో మనం తలెత్తుకుని తిరగాలంటే హేతుబద్ధమూ, వైజ్ఞానికమూ అయిన విద్య అవసరమని భావించాడు. జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనిక, గణిత శాస్త్రాలు బోధించాలని కోరాడు. 1823 డిసెంబర్‌ 11న నాటి గవర్నర్‌ జనరల్‌ ఆమ్‌ హేస్ట్స్‌ కు రాసిన లేఖలో డిమాండ్‌ చేశాడు. విజ్ఞాన శాస్త్రాలను వంగ భాషలోనే అంటే మాతృభాష లోనే బోధించే ఏర్పాట్లు చేశాడు. 1925లో సంస్కృత పాఠశాలను స్థాపించాడు.
సంపాదకుడిగా, కవిగా, వాగ్గేయకారుడిగా ఎంతో కృషి చేశాడు. తాను ఏ ప్రత్యేక మతానికి చెందిన వాడుగా రాయ్  అంగీకరించలేదు. తన మరణం తరువాత హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు తనను తమ వ్యక్తిగా భావించుకుంటారని మిత్రులతో అన్నాడు.
సంస్కర్తగా...
హిందూ మతాన్ని మా, మన అనకుండా వాళ్ల మతం అనేవాడు. తద్వారా రారు మతాతీత దృక్పథం కలిగి ఉన్నవాడని అర్థమౌతుంది. కులాలు, మతాలు ప్రజలలో చీలికలు కల్పించి సమైక్యతను భంగపరుస్తున్నాయని, జాతీయ మానవతావాద దృష్టి రూపొందాలని తలపెట్టాడు. రాజకీయ సంస్కరణల్లో న్యాయ పరిపాలనను, పత్రికా స్వాతంత్య్రాన్ని కోరాడు. న్యాయ వ్యవస్థలో జ్యూరీ (జడ్జితో పాటుగా స్థానిక ప్రముఖులు ఉండే) విధానాన్ని అభినందించాడు. ఆర్థిక విషయాలలో జమిందారీ వ్యవస్థ దోపిడీని అరికట్టాలని కోరాడు. 1893 శాశ్వత కౌలుదారీ చట్టంతో జమిందారులే లాభపడ్డారని పేదరైతులు మరీ దిగజారి పోయారని కౌలు రేట్లు తగ్గించాలని 1832లో ప్రభుత్వాన్ని కోరాడు. రైతులు తాము పండించిన దినుసులు, కూరగాయలు మార్కెట్‌లో అమ్మకానికి తెచ్చినపుడు జమిందార్లు నిర్దయగా పన్నులు వసూలు చేయటాన్ని రద్దు చేయాలని కోరాడు. బ్రిటిషు కంపెనీలు ఉప్పు వ్యాపారాన్ని కాంట్రాక్టుకు తీసుకుని దాని ధరను బాగా పెంచేలా దిగుమతి ఉప్పుకు రాయితీలు ఇచ్చి స్థానిక సముద్ర ఉప్పుకు పన్నులు అధికంగా వేసేవారు. దీన్ని రాయ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాడు.ప్రతి ఏటా పాలనా ఖర్చులు పేర ఇక్కడి నుండి ఇంగ్లండుకు కోట్లాది రూపాయలు తరలించుకుపోవడాన్ని పట్టికలతో సహా చూపించి నిరూపించి ప్రచారం చేశాడు.
స్త్రీల ఆస్తిహక్కు కోసం... సతీ సహగమనాలకు వ్యతిరేకంగా ...
తల్లిదండ్రుల ఆస్తిలో స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా హక్కు కావాలని రారు కోరాడు. అణచివేత నుండి విముక్తులు కావడానికి అదో ఆయుధంలా స్త్రీలకు ఉపయోగపడుతుందనేవాడు. ఈ అంశంపై పురాతన ధర్మశాస్త్రాలను ఉటంకిస్తూ పత్రికలలో వ్యాసాలు రాసేవాడు. భర్త చనిపోతే అతనితోపాటు భార్యను కూడా చితిమంటలలో వేసి కాల్చివేసే సతీ దురాచారాన్ని వ్యతిరేకించి చట్టపరంగా రద్దు చేయించడానికి చేసిన కృషి ద్వారా రాయ్కి అమిత ఖ్యాతి వెచ్చింది. బ్రాహ్మణ, క్షత్రియ కులాల వారిలో సతీ సహగమనం పెద్దఎత్తున సాగుతుండేది. 'సతి' ఆచారానికి సంబంధించిన చారిత్రక, పురాణ ఆధారాలను అద్యయనం చేశాడు. పాతివ్రత్యం, స్వర్గకాంక్ష, సామాజిక పరిస్థితుల పేరుతో మహిళలను బలవంతంగా... చనిపోయిన భర్త చితిమంటల మీద పడేసి, కట్టేసి, మంటల లోకి విసిరేసి చంపడాన్ని అసహ్యించుకున్నాడు. 1815లో సతీ సహగమనానికి వ్యతిరేకంగా మొదటి రచన చేశాడు. 1785లో 385 మంది, 1810లో 839, 1815లో 378, 1818లో 839, 1821లో 654, 1823లో 557, 1825లో 689 మంది సజీవ దహనాలు జరిగాయి. వాటి ఆధారంగా సతీ సహగమనాన్ని రాజా రామ్మోహన్‌ రాయ్  'సతుల సజీవ దహనం' అంటూ తీవ్రంగా వ్యతిరేకించాడు. స్వయానా తన వదిన అలా బలి కావడంతో ఆయన చాలా మనోవేదనకు గురయ్యాడు. 1828లో ఇండియాకు గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన విలియం బెంటింగ్‌కు సతీ దురాచారానికి సంబంధించిన విషయం తెలిపాడు. ఈ దురాచారాన్ని ఖండిస్తూ 800 మంది ప్రముఖుల సంతకాలు, 120 మంది పండితుల అభిప్రాయాలను తన పిటిషన్‌కు జతపరిచి అందచేశాడు. బ్రిటిష్‌ పార్లమెంటు ఆమోదంతో 1829 డిసెంబర్‌ 4న సతీ ఆచరణను రద్దుపరిచారు. దాన్ని అతిక్రమించిన వారు శిక్షార్హులు. కానీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మూర్ఖులు...మహిళల్ని రెచ్చగొట్టి నాడు కలకత్తాలో 5000 మందితో ప్రదర్శన చేయించారు. చాదస్త పండితులు రాయ్  హిందూ మత సంస్కృతిని భంగపరుస్తునట్టుగా భావించి లండన్‌ కౌన్సిల్‌కు, డైరెక్టర్ల బోర్డుకు ఫిర్యాదులు చేశారు. రాయ్ను వారు వివరణ కోరగా ఆయన ఇచ్చిన సమాధానాన్ని విని వారు ఆ ఫిర్యాదులను కొట్టివేశారు. వితంతువుల ప్రాణాలను ఆచారం పేర అగ్నికి బలికాకుండా నిలిపి వేసే చట్టాన్ని తీసుకురావడంలో రాయ్ చేసిన కృషి మరువలేనిది. చారిత్రకమైనది. ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌, కందుకూరి వీరేశలింగం కృషి కూడా ఆదర్శప్రాయమైనది. బ్రిటిషు పార్లమెంటులో 1831, 1932లలో సంస్కరణల బిల్లు ఆమోదం పొందింది. తద్వారా బ్రిటిషు ఇండియాలో సామాజిక మార్పులకు ఇది కొంత ఊతం ఇవ్వడాన్ని రాయ్  అభినందించాడు. 1833 సెప్టెంబర్‌ 27న రాజా రామమోహన్‌ రాయ్  మరణించాడు.
రాజా రామ్మోహన్‌ రాయ్  హేతువాది. తన పదహారవ ఏట నుండి చనిపోయేంతవరకూ సాహిత్యారాధకుడు, సాంఘిక ప్రయోజన సాధకుడుగా జీవించాడు. ఏ మతంలోనైనా సరే మాయలు, మంత్రాలు వంటి అద్భుతాలను కల్పనలుగా భావించి తోసిపుచ్చాడు. ఆయన సమతా వాది. అన్ని మతాల సారాన్ని, మంచిని అంగీకరించేవాడు. స్వమత పక్షపాతం లేకుండా జీవించాడు.
 

గుడిపాటి నరసింహారావు
/ వ్యాసకర్త సెల్‌ : 94900 98559 /