Nov 13,2023 21:49

వాహనాల రాకపోకలతో రేగుతున్న దుమ్మూ, ధూళి

ప్రజాశక్తి - వీరఘట్టం :  పేరుగొప్ప... ఊరుదిబ్బ అన్న చందంగా వీరఘట్టం గ్రామం పరిస్థితి. ఈ గ్రామం ప్రధాన రహదారి అభివృద్ధికి నోచుకోకపోవడంతో ప్రతిరోజు వందలాది భారీ వాహనాల రాకపోకలతో దుమ్మూ, ధూళి దుమ్మెత్తడంతో రోగాల బారిన పడుతున్నట్లు ప్రజలు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వట్టిగెడ్డ వంతెన నుండి స్వామి థియేటర్‌ వరకు 1.2 కిలోమీటరు దూరంలో రూ.5.5 కోట్లతో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రధాన రహదారి విస్తీర్ణ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు గత ఏడాది ఫిబ్రవరి 19న అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ పి.విక్రాంత్‌లు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి దాదాపు 21 నెలలు కావస్తున్నప్పటికీ రోడ్డు విస్తీర్ణ అభివృద్ధి పనులు జరగకపోవడంతో స్థానికులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్భాటంగా శంకుస్థాపన చేసి ఉపన్యాసాలు చేసి వెళ్లారే తప్ప రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. కలెక్టర్‌తో సహా జిల్లా ఉన్నతాధికారులు పాలకొండ, సీతంపేట తదితర మండలాలకు వెళ్లాలంటే వీరఘట్టం ప్రధాన రహదారి గుండానే రాకపోకలు సాగించాలి. అయినా ఈ రోడ్డు పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు. అలాగే ఒడిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తీస్గడ్‌ తదితర అంతర్‌ రాష్ట్రాలకు ఇదే రహదారి గుండా భారీ వాహనాలతో ఫ్యాక్టరీలకు ముడిసరుకులు తరలిస్తున్నారని, అలాగే గతనెల అక్టోబర్‌ 20న అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద భారీ కంటైనర్‌ మరమ్మతులకు గురై రహదారికి అడ్డంగా నిలిచిపోవడంతో వందలాది వాహనాల అటు వీరఘట్టం నుంచి పాలకొండ వైపు ఇటు వీరఘట్టం నుంచి పార్వతీపురం వైపు వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్రధాన రహదారి దుమ్ము ధూళితో పాటు పెద్ద పెద్ద పిక్కరాళ్లు పైకి తేలడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు ట్యాంకర్ల ద్వారా దుమ్ము ఎగరకుండా ఉండేందుకు నీటితో రహదారిని తడుపుతున్నప్పటికీ పెనం మీద నీళ్లు చల్లినట్లు ఉంటుందని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అర్ధాంతరంగా నిలిపివేసిన ప్రధాన రహదారి విస్తరణ అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.