May 16,2021 13:32

బతుకు బాటలో తిరుగాడిన దేహాలు
దైన్యస్థితిని చేరాయి
చిరస్థాయిగా నాటుకొన్న జీవితపు కలలు
కల్మశాన్ని నింపాయి
పదే పదే నిలువరిస్తూ
కాలం కన్నీటిని వొంపింది !

నింపాదిగా నడవాల్సిన పాదాలు
భయాల్ని తాకాయి
సాఫీగా సాగాల్సిన జీవన యానం
ఒడిదొడుకుల ఉప్పెనైంది
స్వేచ్ఛగా విహరించాల్సిన
గమ్యపు దారులు చీకటిని ఆక్రమించాయి

మనిషిదిప్పుడు ఉలికిపాటు కలత నిద్ర
కోడిపిల్లను గద్ద తన్నుకుపోయే
దు:ఖభరితపు ఆట
తల్లో తండ్రో అన్నో తమ్ముడో చెల్లో
అవ్వో తాతో మాయమయ్యే దీనగాథ

ఏ ఊరి గుమ్మాల్ని తాకినా
మనిషి కన్నీటి వాసన
ఏ శ్మశానాన్ని పలకరించినా
కట్టె కాలుతున్న ధూమ నైరాశ్యం
ఎవర్ని పలకరించినా నిట్టూర్పుల వాసన
మనిషిని కాటేస్తూ కరోనా ద్ణుఖపు వాసన..!

- మహబూబ్‌ బాషా చిల్లెం
95020 00415