ప్రజాశక్తి- అరకు లోయ :మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ దుక్కగుడ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి.
గ్రామ సమీపంలోని కలంలో దాన్యం కుప్పలు ఉన్నాయి. మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఆహుతి అయ్యాయి. తెల్లారేసరికి కలం వద్దకు వెళ్లి చూడగా, ధాన్యం కుప్పలంతా ఖాళీ బూడిదై ఉండడాన్ని గమనించిన రైతులు బోరున విలపించారు. చిట్టెమ్ నాయుడు గురుమూర్తి, కుర్ర కొండ, కొర్రా రాము, పొట్టంగి మొద్దు అనే గిరిజనులకు చెందిన వరి కుప్పలు దగ్ధమైనట్లు సుంకరమెట్ట సిపిఎం సర్పంచ్ గమ్మెలి చిన్నబాబు, సిపిఎం మండల కార్యదర్శి రామారావులు విలేకరులకు తెలిపారు. వరి కుప్పలు సుమారు 150 బస్తాల ధాన్యం కోల్పోయినట్లు బాధితులు విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదంతా కాయ కష్టం చేసి పండించిన పంట అగ్నికి ఆహుతి అయి సర్వం కోల్పోయారని, ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని సుంకరమెట్ట సర్పంచ్ చినబాబు కోరారు.