
ప్రజాశక్తి - దుగ్గిరాల : మండల కేంద్రమైన దుగ్గిరాల రైలుపేటలోని హేమలత ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్‌ను వ్యవసాయ, రెవెన్యూ శాఖాధికారులు గురువారం తనిఖీ చేశారు. 26 అల్యూమినియం ఫాస్పేట్ (సల్ఫాస్ టాబ్లెట్లు) బాటిల్స్‌ను, 29 ప్యాకెట్ల జింక్ సల్ఫేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.30 వేల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన సల్ఫాస్ టాబ్లెట్లు పసుపు బస్తాల్లో గోడౌన్లలో పుచ్చు పట్టకుండా వాడుతారు. లైసెన్స్ లేకుండా అమ్ముతున్నందుకు వీటిని వ్యవసాయ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమానిపై కేసు నమోదు చేశామని, శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్.ఉషారాణి, దుగ్గిరాల, కొల్లిప మండలాల వ్యవసాయ శాఖాధికారులు పి.శిరీష, కె.వెంకటరావు ఎఇఒ రమేష్, వీఆర్వోలు మహేష్, ఫకీరయ్య పాల్గొన్నారు.