Oct 01,2023 20:52

బత్తలపల్లి పోలీసుస్టేషన్‌ వద్ద బాధితులు

ప్రజాశక్తి బత్తలపల్లి : తమ వద్ద దుబాయి కరెన్సీ ఉంది మార్చుకుని సొమ్ము చేసుకోవాలని దంపతులను అగంతకుడు బురిడీ కొట్టించి రూ. 8లక్షలతో ఉడాయించిన సంఘటన మండల కేంద్రమైన బత్తలపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈఘటనకు సంబందించి బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలు...
ముజహర్‌ అహ్మద్‌ అనే వ్యక్తికి అనంతపురం పట్టణంలోని పాతూరు తాడిపత్రి బస్టాండ్‌ వద్ద మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో చెప్పుల దుకాణంతోపాటు కూల్‌ డ్రింక్‌ దుకాణం ఉంది. ఈ నేపథ్యంలో సలీం అనే పేరుతో ఓ వ్యక్తి ముజహర్‌ అహ్మద్‌తో పరిచయం పెంచుకున్నాడు. 'మిమ్మల్ని చూస్తే చాలా మంచివారుగా ఉన్నా'రంటూ నమ్మబలికాడు. తమది బీహార్‌ రాష్ట్రమని, తాము పెయింటింగ్‌ వర్క్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పాడు. తన వద్ద దుబాయి కరెన్సీ ఉందని, వాటిని మార్చుకుంటామంటే ఇస్తానని చెప్పాడు. రూ. 8 లక్షలు ఇస్తే రూ.16 లక్షలు విలువ చేసే దుబాయి కరెన్సీని అప్పగిస్తానని ఆశ చూపాడు. దీంతో ముజహర్‌ అహ్మద్‌ ఆశకు పోయాడు. 'మీ వద్దనున్న నోట్లు ఇవ్వండి వాటిని పరీక్షించుకుంటాన'ని అడిగాడు. దీంతో సలీం ఆయనకు దుబారు నోటు ఇవ్వగా దానిని బెంగుళూరులో తనకు తెలిసిన వ్యక్తిని ముజహర్‌ అహ్మద్‌ చూపించాడు. ఆయన ఈ నోటుకు భారత్‌ కరెన్సీ రూ. 16లు వస్తుందని చెప్పాడు. దీంతో ముజహర్‌ అహ్మద్‌కు సలీంమీద కొంత నమ్మకం కలిగింది. అయినా దుబాయి కరెన్సీ ఎలా వచ్చిందని సలీంను ప్రశ్నించగా తాను, తన భార్య ముంబైలో వృద్ధురాలి ఇంటిలో పనిచేస్తుండేవారమని, ఇటీవల ఆమె మృతిచెందడంతో ఆమె కుమారుడు తమకు ఈ డబ్బు ఇచ్చాడని నమ్మబలికాడు. తనకు దుబారుకరెన్సీ పూర్తిగా చూపితేనే నమ్ముతానని ముజహర్‌ అహ్మద్‌ చెప్పడంతో బత్తలపల్లికి వస్తే చూపుతానని సలీం సమాధానమిచ్చాడు. దీంతో మూడు రోజుల క్రితం దీంతో ముజహర్‌ అహ్మద్‌ బత్తలపల్లికి వచ్చాడు. ఆసందర్భంలో సలీం ముజహర్‌ అహ్మద్‌ను జన సంచారం లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి దుబాయి కరెన్సీని చూపాడు. దీంతో ముజహర్‌ అహ్మద్‌కు పూర్తి నమ్మకం కలిగింది. అక్కడ నుంచి అనంతపురానికి వచ్చిన ముజహర్‌ అహ్మద్‌ డబ్బులు పోగుచేసుకున్నాడు. రూ. 8 లక్షలు తీసుకొని బత్తలపల్లికి వస్తున్నట్లు సలీంకు సమాచారం అందించాడు. అందులో భాగంగా ముజహర్‌ అహ్మద్‌ డబ్బులు తీసుకుని తన భార్య ఫరీదాతో కలసి ఆదివారం బత్తలపల్లికి ద్విచక్రవాహనంలో వచ్చాడు. సలీం వీరిని బత్తలపల్లిలోని ఎస్సీ కాలనీ వద్దకు రావాలని సూచించాడు. ఆ ప్రదేశంలో సీసీ కెమెరాలు లేవు. అక్కడకు మజాహర్‌ అహ్మద్‌ తన భార్య పరీదాతో కలసి ద్విచక్ర వాహనంలో వచ్చి రూ. 8 లక్షలు సలీంకు అందజేశారు. ఆ సమయంలో సలీం, మరో మహిళ ముజహర్‌ అహ్మద్‌ దంపతులకు ఓ బ్యాగు ఇచ్చారు. దుబాయి కరెన్సీ ఉన్న మూట బ్యాగులో ఉందని చెప్పి వారిచ్చిన రూ. 8 లక్షలు తీసుకుని అక్కడ నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి ద్విచక్ర వాహనంలో ఉడాయించారు. ఐదు నిమిషాల తర్వాత ముజహర్‌ అహ్మద్‌ దంపతులు బ్యాగు తెరిచి చూసి అవాక్కయ్యారు. అందులో పాత న్యూస్‌పేపర్లు ఉండటంతో లబోదిబోమంటూ బత్తలపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తమకు జరిగిన మోసాన్ని వివరించారు. సలీం అనే వ్యక్తికి తాము డబ్బు ఇచ్చిన దృశ్యాన్ని వారికి తెలియకుండా వీడియో తీసుకున్నామని చెప్పారు. అంతా విన్న పోలీసులు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీంతో బాధితులు అనంతపురం వెళ్లి అక్కడ పోలీసులను కలిశారు. అయితే ఘటన జరిగింది బత్తలపల్లిలో కాబట్టి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితులు తాము ఎవ్వరి వద్దకు వెళ్లాలి.. ఎవరు న్యాయం చేస్తారో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.