Sep 30,2023 17:17
  • అక్టోబర్‌ 7వరకు అవకాశం : ఆర్‌బిఐ వెల్లడి

ముంబయి : రూ.2,000 నోట్ల మార్పిడికి గడువు పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) నిర్ణయం తీసుకుంది. పెద్ద నోటు మార్పిడి, డిపాజిట్‌కు తొలుత సెప్టెంబర్‌ 30 నాటికి గడువు విధించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 7వరకు ప్రజలు నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్‌బిఐ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రూ.2000 నోట్ల ఉపసంహరణపై సమీక్ష జరిపిన ఆర్‌బిఐ మరోసారి నోట్లను మార్పుకునేందుకు గడువును పొడిగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అప్పటి వరకు ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.2వేలనోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. 2023 మే 16న రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బిఐ వెల్లడించింది. దాదాపు 93 శాతం నోట్లు బ్యాంక్‌లకు తిరిగి వచ్చాయని సెప్టెంబర్‌ 2న తెలిపింది. బ్యాంక్‌లకు చేరిన మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోకి రాగా.. 13 శాతం కరెన్సీనీ నోట్ల రూపంలోకి మార్చుకున్నారు. ఎవరివద్దనైనా రూ.2000 నోట్లు ఉంటే ఈ వారం రోజుల్లోనే బ్యాంకుల్లో, పోస్టాఫీస్‌లలో మార్చుకోవచ్చని సూచించింది.