కష్ట సమయాల్లో 'నేనున్నా.. నీకేమీ కాదు' అనే భరోసా ఇచ్చే వారుంటే ధైర్యంగా ఉంటుంది. అలా ఉంటే ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో దాటేయవచ్చు. ఒకవేళ ఆ సమయంలో నా అనే వారే లేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. అచ్చు అలాంటి కష్టమే వచ్చింది ఉత్తరప్రదేశ్ మీరట్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు అన్మోల్‌కు. రెండేళ్ల క్రితం తండ్రి మరణించాడు. ప్రస్తుతం తల్లి మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నా అనేవారే లేని ఆ బాలుడి హృదయ విదారక కథ తెలుసుకున్న ఖాకీల మనసు కరిగిపోయింది. మీరట్ పోలీసుస్టేషన్ అతన్ని దత్తత తీసుకుంది. కన్నబిడ్డలా అన్మోల్‌ను చూసుకుంటున్న ఖాకీల గురించే నేటి స్ఫూర్తి.
ఉత్తరప్రదేశ్ మీరట్‌లో అన్మోల్ వాళ్లది చిన్న కుటుంబం. సంతోషంగా సాగిపోతోంది ఆ కుటుంబ నావ. అలాంటిది రెండేళ్ల క్రితం ఆ కుటుంబ యజమాని రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా కన్నుమూశాడు. తల్లే తన బిడ్డ ఆలనాపాలనా చూసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ భర్త మరణాన్ని జీర్ణించుకోలేక, ఆమె మానసిక ఆరోగ్యం క్షీణించింది. ఈ పరిస్థితుల్లో 14 ఏళ్ల అన్మోల్ ఏకాకి అయిపోయాడు.
'మూడు నెలల క్రితం అన్మోల్ వాళ్ల అమ్మ ఫిర్యాదు చేయడానికి మా స్టేషన్‌కు వచ్చింది. అదే మొదటిసారి ఆమెను చూడడం. మాట తీరుని బట్టి ఆమె మానసిక ఆరోగ్యం సరిగాలేనట్లు గుర్తించాం. వెంటనే జిల్లా ఆసుపత్రిలో చేర్పించాము. ప్రస్తుతం ఆమె ఆగ్రాలోని ఒక మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ సమయంలో అన్మోల్ ఒంటరిగా మిగిలాడు. బంధుమిత్రులు ఎవరూ అతని కోసం రాలేదు. ఆ పసివాడిని అలా చూసేసరికి చాలా బాధేసింది. ఇంత చిన్న వయస్సులో ఒంటరిగా వదిలేస్తే నేరప్రవృత్తి వైపు మళ్తుతాడు. అటు వైపు అడుగులు వేసే వారిలో ఎక్కువమంది టీనేజర్లే. అందుకే అన్మోల్ ఉజ్వల భవిష్యత్తు బాగుండాలంటే దత్తత తీసుకోవడమే సరైంది అనిపించింది' అంటున్నారు కంకర్‌ఖేరా పోలీసుస్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) సాగర్.
ప్రస్తుతం ఆ స్టేషన్‌లోని మొత్తం సిబ్బంది అన్మోల్‌ని కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. 'అన్మోల్ బాగా చదువుకోవాలని అనుకుంటున్నాడు. నగరంలోని కొన్ని పాఠశాలల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే మంచి పాఠశాలలో చేరుస్తాం. అతను స్టేషన్‌నే ఇల్లులా భావిస్తున్నాడు. మేమంతా అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం' అంటున్నారు ఎస్‌హెచ్‌ఓ సాగర్. 'బాలుడు ఇక్కడ చాలా సౌకర్యంగా ఉన్నాడు. మాతో సరదాగా మాట్లాడతాడు. మేము ఇచ్చిన పుస్తకాలను చదువుకుంటూ ఉంటాడు. భోజనం మాతోనే కలిసి చేస్తాడు.' అంటున్నారు స్టేషన్‌లో పనిచేసే మరో సిబ్బంది.
ఈ మధ్య అన్మోల్ పుట్టినరోజు సందర్భంగా స్టేషన్‌లో కేక్ కట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కథ వెలుగులోకి వచ్చింది. దాంతో శిశు సంక్షేమ కమిటీ (సిడబ్లుసి) అన్మోల్‌ను వారి ముందు హాజరు పరచాలని ఎస్‌హెచ్‌ఓను కోరింది. కష్టాలన్నీ మరచిపోయి అన్మోల్ తన లక్ష్యంవైపు ప్రయాణించి, కలలను సాకారం చేసుకోవాలని మనమూ కోరుకుందాం.