పెరిగిన చలి
ప్రజాశక్తి -సీలేరు
జీకే వీధి మండలం, సీలేరు పరిసర ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 7, 8 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. దీంతో వాహన చోదకులు హెడ్ లైట్లు వేసుకొని టపయాణించవలసిన పరిస్థితి నెలకొంది. మంచు కారణంగా చలి తీవ్రత కూడా పెరిగింది. సాధారణంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో మంచు తీవ్రత అధికంగా ఉంటుంది. చల్లని గాలులు వీస్తూ గజగజ వణికించే విధంగా చలి తీవ్రత ఉంటుంది. అయితే ఈ ఏడాది జనవరి నెల చివరిలో స్వల్పంగా మంచు కురుస్తూ తీవ్రత తగ్గు ముఖం పట్టింది. అయితే వారం రోజుల నుంచి మళ్లీ మంచు, చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగా ఉంటూనే రాత్రి అయ్యే సరికి ఒక్కసారిగా వాతావరణం మారి మంచు విపరీతంగా కురుస్తుంది. చలి తీవ్రత వల్ల గిరిజనులు, తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్ళే స్థానిక యువకులు ఇబ్బందులు గురవుతున్నారు. దారకొండ, దుప్పిలివాడ, కాట్రగెడ్డ, పిల్లిగెడ్డ గ్రామాల్లో మంచు తీవ్రత అధికంగా ఉండడంతో గిరిజనులు చలిమంటలతతో ఉపశమనం పొందుతున్నారు.
ఆహ్లాదాన్ని ఇస్తున్న మంచు అందాలు
సీలేరు పరిసర ప్రాంతాల్లో మంచు అందాలు సందర్శకులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. స్థానిక రెగ్యురేటరీ డ్యాం, మెయిన్ డ్యాం సమీప అటవీ ప్రాంతంలో మంచు తీవ్రత సుందర దృశ్యాలు గురువారం ఉదయం ఆవిష్కృతమయ్యాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల నుంచి తెల్లవారుజామున రాకపోకలు సాగిస్తున్న వాహన చోదకులు ప్రకృతి అందాలు చూసి వారి సెల్‌ఫోన్లలో బంధించి ఎంతో అనుభూతిని పొందుతున్నారు.










