Aug 30,2023 23:20

ప్రజాశక్తి - యంత్రాంగం
            రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రైమ్‌ 2.0 కార్డ్‌ విధానాన్ని నిరసిస్తూ రెండు రోజుల పాటు చేపట్టనున్న దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్‌ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద లేఖర్లు, సహాయకులు నిరసన తెలిపారు.
భీమడోలు:రిజిస్ట్రేషన్‌లకు కొత్తసాఫ్ట్‌వేర్‌ కార్డ్‌ ప్రైమ్‌ 2.0 విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల పరిధిలో పనిచేసే దస్తావేజుల లేఖర్లు, వారి అనుబంధ సిబ్బంది రెండు రోజులపాటు చేపట్టిన పెన్‌డౌన్‌ భీమడోలులో బుధవారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం బయట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల యూనియన్‌ భీమడోలు శాఖ ప్రతినిధులు నండూరి శ్రీరామ్‌, మురళీ మాట్లాడుతూ ఈ విధానం వల్ల క్షేత్రస్థాయిలో పలు సమస్యలు తలెత్తుతాయన్నారు. ఆస్తులకు ఒరిజినల్‌ డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల వాటి భద్రతకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని విమర్శించారు. దీనిలో భాగంగా ఆధార్‌, ఫోన్‌ లింక్‌ అప్‌, ఒటిపి ఇతర విధానాలు స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా నిర్వహించే పద్ధతులు అందరికీ తెలిసే అవకాశాలు లేనందున కక్షిదారులు ఇబ్బందులు పాలవుతారన్నారు. ఆస్తులు రిజిస్ట్రేషన్‌ సమయంలో దస్తావేజుల లేఖర్లు ఇరుపక్షాల వారి మధ్య వచ్చే సందేహాలు, తలెత్తే సమస్యలకు సామరస్య వాతావరణంలో పరిష్కారం చూపి ఇరుపక్షాల వారికి నష్టం లేని విధంగా రిజిస్ట్రేషన్లు జరిగినందుకు సహకరిస్తున్నారు. కార్డ్‌ ప్రైమ్‌ 2 .0 విధానములో సదర సమస్యల పరిష్కారానికి తావులేని కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని వారు తెలిపారు. ఒరిజినల్‌ డాక్యుమెంట్‌తో సంబంధం లేకుండా డిజిటల్‌ డాక్యుమెంట్‌తో రిజిస్ట్రేషన్‌ చేయటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు కొత్త సాఫ్ట్‌వేర్‌ వాడకాన్ని మానుకోవాలని వారు కోరారు.
పోలవరం : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రైమ్‌2.0 కార్డు విధానాన్ని నిరసిస్తూ పోలవరం పరిధిలోని దస్తావేజు లేఖర్లు, సహాయకులు స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెన్‌డౌన్‌ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సారిక శివ కుమార్‌, రాకుర్తి హరనాధరావు, పెంజర్ల రమేష్‌, పెరుమాళ్ల గోవిందరావు, నందమూరి మహేష్‌, కారింకి నాగేశ్వరావు పాల్గొన్నారు.