Apr 26,2023 23:53

ఆందోళన చేస్తున్న ఎన్‌టిపిసి కాంట్రాక్టు కార్మికులు

ప్రజాశక్తి -పరవాడ
పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో కాంటాక్ట్‌ కార్మికులకు డస్ట్‌ అలవాన్స్‌ పెంచుతూ వెంటనే అగ్రిమెంట్‌ చేయాలని కోరుతూ ఎన్టిపిసి కాంటాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం ఎన్‌టిపిసి సింహాద్రి మెయిన్‌ గేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రధాన కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్‌టిపిసిలో డస్ట్‌ అలవెన్స్‌ సమస్య సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టడం దుర్మార్గమన్నారు. మెడికల్‌ టెస్టు పేరుతో వేధింపులు గురి చేయడం, డ్యూటీ నుండి నిలిపివేయడం అన్యాయమన్నారు. కార్మికులకు ఇచ్చే ఐడి కార్డుల్లో ఎన్టిపిసి లోగో తొలగించడం, కాంట్రాక్ట్‌ కార్మికులను యాజమాన్యం చులకనగా చూడడం దారుణమన్నారు. ఎన్‌టిపిసిలో ఉన్న అన్ని యూనియన్లతో యాజమాన్యం సమావేశం ఏర్పాటు చేసి డస్ట్‌ అలవెన్స్‌ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు పిపి.నాయుడు, ఉపాధ్యక్షులు పి.గోవిందరాజు, వి.అప్పారావు, బి.కన్ననాయుడు, ఎం.లోవరాజు, కె.సన్నిబాబు, కార్మికులు పాల్గొన్నారు.