వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి - టి.నరసాపురం
నవరత్నాల్లో దశరత్నం పథకం కింద భూ పంపిణీ చేర్చి రాష్ట్రంలో ఎనిమిదో విడత భూపంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మక సంఘం ఆధ్వర్యంలో మండలంలోని రామన్నపాలెంలో జిల్లా సదస్సు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అసైన్డ్, సీలింగ్, 1/70, 9/77 చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు, జిఒలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూడు వేల ఎకరాల ఎర్ర కాలువ మిగులు భూములు, దోసపాడు అసైన్డ్, సీలింగ్ భూములను పేదలకు పంచాలన్నారు. పాత చింతలపూడి పరిధిలో ఉన్న 30వేల ఎకరాల ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పట్ల వివక్ష చూపుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అసైన్డ్, సీలింగ్ ప్రభుత్వ భూములు పేదల పంచాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే, ఉద్యమ నేతలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సుమారు 250 కేంద్రాల్లో భూపోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ పోరాటాల్లో భాగంగానే ఏలూరు జిల్లాలో ఎర్ర కాలువ రిజర్వాయర్ మిగులు భూముల పోరాటం, దోసపాడు భూ పోరాటం బుట్టాయగూడెం మండలంలో ఇళ్ల స్థలాల పోరాటం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ బ్యాంకుల పేరుతో దళితుల, పేదల భూములను లాక్కొని భూస్వాములకు కట్టబెడుతున్నాయన్నారు. పేదలకు భూ పంపిణీ చేయకపోగా తరతరాలుగా అనుభవిస్తున్న దళిత, గిరిజన బలహీనవర్గాలకు చెందిన అసైన్డ్, జరాయితీ, సీలింగ్, ప్రభుత్వ భూములను పెత్తందారులకు ఇస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పేరుతో పేదలకు అనుకూలంగా ఉన్న సీలింగ్, అసైన్డ్, 1/77, 9/77 చట్టాలు, అటవీ హక్కుల చట్టం, 2013 భూ సేకరణ చట్టాలను తుంగలో తొక్కి నష్టపరిహారం చెల్లించకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే వైఖరిని అవలంభిస్తున్నాయని విమర్శించారు. ఎక్కడైనా పేదలు భూమి కోసం తిరగబడితే అక్రమంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మిగులు భూముల కోసం ఆరేళ్లుగా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదల హక్కులకు భంగం కలగకుండా ఎల్‌టిఆర్ భూముల సాగుకు పట్టాలివ్వాలని కోరుతున్నా చెవిటివాడిముందు శంఖం ఊదినట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. తరతరాలుగా ఆదివాసీలు పోడు నరికి సాగు చేస్తున్న అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా రకరకాల సాకులు చెబుతూ దాట వేస్తున్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులను గోదావరిలో ముంచి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, భూమికి భూమి ఇవ్వడంలో పునరవాస కాలనీల నిర్మాణంలో, జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి టి.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్ సిఐటియు జిల్లా నాయకులు ఆర్‌విఎస్ నారాయణ మాట్లాడుతూ కరోనాకాలంలో పేదలను ఆర్థికంగా ఆదుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ఈ జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం పేద రైతులు వ్యవసాయ కార్మికులు, కూలీలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ భూమికి భూమి పరిహారం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ జిల్లాలో రైతులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజ నులు ఐక్యంగా భూమి కోసం పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. భూమి కోసం పేదలు రోడ్డెక్కి పోరాడుతుంటే ప్రభుత్వాలు బెదిరించడం దారుణమన్నారు. పేదలు చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమ య్యాయని విమర్శించారు. రాబోయే కాలంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సద స్సులో సంఘం జిల్లా నాయకులు తుమ్మల సత్యనారాయణ, అందుగుల ఫ్రాన్సిస్, వై.సీత, డి.సత్యనారాయణ నాయకత్వం వహించారు. సుమారు 80 మంది నేతలు పాల్గొన్నారు.










