
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : దసరా పండుగ పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలో 70 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ట్రాఫిక్, గ్యారేజ్ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ నగరాల నుంచి ఉమ్మడి జిల్లా అనంతపురంతో పాటు సత్యసాయి జిల్లాకు ఈనెల 18 నుంచి 23 వరకు 70 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. హైదరాబాదు నుంచి 30 సర్వీసులు బెంగళూరు నుంచి తిరుపతి నుంచి 10 సర్వీసులు విజయవాడ నుంచి ఐదు సర్వీసులు కాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో 15 సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు. ఈ సర్వీసులకు సాధారణ చార్జీలు మాత్రమే వసూలు చేయనున్నట్లు తెలిపారు. దూర ప్రాంత ప్రయాణికులు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఈనెల 24 నుంచి 25వ తేదీ వరకు ముఖ్యమైన నగరాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. ఈ సదుపాయాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఇనయతుల్లా, ఎస్‌టిఐ పెద్దన్న, గ్యారేజీ సూపర్వైజర్లు పాల్గొన్నారు.