అగనంపూడి పునరావాసకాలనీలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు డిమాండ్
ప్రజాశక్తి -గాజువాక : అగనంపూడి ఉక్కు పునరావాస కాలనీలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ కోరారు. గురువారం అగనంపూడి ఆర్‌ఈసిఎస్ కార్యాలయం ఎదుట స్థానిక నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈనెల 5న, దసరా రోజు అర్థరాత్రి రెండు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా లేదని, దీంతో అగనంపూడి నిర్వాసితుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. 40 వేల జనాభా ఉన్న అగనంపూడిలో విద్యుత్ సమస్య లేకుండా చేసేందుకు మంగళపాలెంలో, అగనంపూడి జూనియర్ కాలేజ్ వెనుక విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసినా, ఇంతవరకు పూర్తిస్థాయిలో సరఫర్లా ఇవ్వడం లేదన్నారు. దీనిపై విద్యుత్‌శాఖాధికారులను అడిగితే ఓవర్ లోడ్ అంటూ తప్పించుకుంటున్నారే తప్ప, ప్రజల ఇక్కట్లు పట్టడం లేదన్నారు. ఈ నేపథ్యంలో అగనంపూడి సెక్షన్ కార్యాలయం పరిధిలో ఇండోర్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి కార్యదర్శి గంటకూర అప్పారావు మాట్లాడుతూ, 1990లో అగనంపూడి నిర్వాసితుల కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పనలో నిర్లక్ష్యం తగదన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు విందులు వరహాలు, లయన్స్ క్లబ్ చైర్మన్ హనుమంతరావు, పాల్గొన్నారు.










