ప్రజాశక్తి - చిలకలూరిపేట : జగనన్న కాలనీల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లన్నీ దసరా నాటికి పూర్తి చేయాలని అధికారులనను వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. గృహ నిర్మాణంపై అధికారులతో స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో మంత్రి శుక్రవారం సమీక్షించారు. దసరా నాటికి కనీసం 1500 ఇళ్లయినా పూర్తవ్వాలన్నారు. లే అవుట్లలో తాగునీటి వసతి, విద్యుత్, డ్రెయినేజీ, రోడ్లు తదితర సదుపాయాలు కల్పించామని, ఇంకెక్కడైనా చేయాల్సి ఉంటే వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. నిర్మాణదార్లకు బిల్లులు సకాలంలో మంజూరు చేయాలని, పసుమర్రు లే అవుట్‌కు అప్రోచ్ రోడ్డును అభివృద్ధి చేయాలని అన్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించని వారితో సమావేశాలు నిర్వహించాలని, నిర్మాణానికి వారిని ప్రోత్సహించాలని సూచించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎమ్‌డి లక్ష్మిషా మాట్లాడుతూ బిల్లులు వెంటనే మంజూరయ్యేలా చూస్తామన్నారు. పసుమర్రు లే అవుట్ రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్లలో ఒకటని, దీన్ని మోడల్ కాలనీగా అభివృద్ధి చేస్తామని అఆ్నరు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ మాట్లాడుతూ లే అవుట్లకు అప్రోచ్ రోడ్లను వెంటనే అభివృద్ధి చేస్తామని చెప్పారు. తొలుత పసుమర్రు లే అవుట్‌ను మంత్రి, అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










