Oct 22,2023 23:49

పోలీసులతో మాట్లాడుతున్న మన్నవ మోహన్‌కృష్ణ

ప్రజాశక్తి - గుంటూరు సిటీ : దసరా పండుగను పురస్కరించుకొని మన్నవ మోహన కృష్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి నాయకులు మన్నవ మోహనకృష్ణ ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గుజ్జనగుండ్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమ ప్రాంగణాన్ని ఉదయం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బలగాలు మొహరించి లబ్ధిదారులను, టిడిపి కార్యకర్తలను అక్కడినుండి పంపించారు. కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అనుచరులతో కలిసి వచ్చిన మన్నవ మోహనకృష్ణను, అతని అనుచరులను కార్యక్రమ ప్రాంగణంలోకి రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమం నిర్వహణకు సహకరించాలని మోహన్‌ కృష్ణ కోరగా అనుమతులు లేవంటూ పోలీసులు అంగీకరించలేదు. దీంతో నిర్వాహకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పర్మిషన్‌ కోసం డీఎస్పీ కార్యాలయాని సంప్రదించిన స్పందన లేదని మోహన్‌ కృష్ణ అన్నారు. ప్రతి సంవత్సరం పండగల సందర్భంగా ఇలా పేదలకు కానుకలు ఇస్తున్నామని, గతంలోనూ ట్రస్ట్‌ ద్వారా తాను సంక్రాంతి కానుక, క్రిస్మస్‌ కానుక, ఉగాది కానుక, రంజాన్‌ తోఫా కార్యక్రమాలను నిర్వహించానని చెప్పారు. ఈసారి దసరా చంద్రన్న కనుక ఇవ్వనివ్వకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లతో పేదల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమని, పరిమితి సంఖ్యలోనే పాసులు ఇచ్చి, బారికేడ్లు పెట్టి, అనుభవం వున్న వాలంటీర్స్‌ని పెట్టి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక ప్రైవేట్‌ స్థలంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ఎందుకు అనుమతించటం లేదు అని అడిగారు. పేదవాడికి రాష్ట్రంలో పట్టెడు సాయం చేయడం పెద్ద నేరంలా పోలీస్‌ వ్యవస్థ పని చేస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.