Nov 14,2022 23:38

  • వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి - కృష్ణా ప్రతినిధి
ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్న పథకాలు పేదరికాన్ని తగ్గించడంలేదని, ఈ నేపథ్యంలో నవ రత్నాలకుతోడు దశమరత్నంగా భూ పంపిణీ చేర్చి ప్రతి పేద కుటుంబానికీ రెండెకరాల భూమిని పంపిణీ చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. భూమి చేతిలో ఉంటేనే పది మంది ఇంటికి వస్తే అన్నం పెట్టే శక్తి పేదలకు, దళితులకు వస్తుందన్నారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణాజిల్లా ద్వితీయ మహాసభను పురస్కరించుకుని కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడిలోని చేబ్రోల్‌ భాస్కరరావు ప్రాంగణం (శాంతికాంప్లెక్స్‌)లో సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. తొలుత పెదపూడి వంతెన సంటర్‌ నుంచి కూచిపూడి బస్టాండ్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షులు యద్దనపూడి మధు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ పంపిణీ చేయడానికి అవసరమైన భూములున్నాయని కోనేరు రంగారావు భూ కమిటీ గతంలోనే తేల్చిందన్నారు. కొనుగోలు చేసిన వారికే భూములు దఖలుపడేలా ఎసైన్‌మెంట్‌ భూముల చట్ట సవరణకు ప్రభుత్వం పూనుకుంటోందన్నారు. పేదలకు పంపిణీ చేసిన భూములను కొనడం నేరమని ఎస్సైన్‌మెంట్‌ చట్టం చెబుతోందన్నారు. అంతేగాక కొనుగోలు చేసిన వారి నుంచి ఎస్సైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకుని తిరిగి పేదలకు ఇవ్వాలని చెబుతోందన్నారు. ఈచట్ట సవరణ జరిగితే దళితులు, పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దళితుల చేతుల్లోని భూములు భూస్వాముల చేతుల్లోకి వెళ్లిపోతాయన్నారు. భూపోరాటాల గడ్డ దివి సీమ ప్రాంతమని, చల్లపల్లి నారాయణరావు, గుంటూరు బాపనయ్య వంటి అమరవీరులు నాయకత్వంలో జరిగిన పోరాటాలతోపాటు ఈ ప్రాంతంలో పాటూరు రామయ్య ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు మూడు వేల ఎకరాలు భూములు పేదలకు పంపిణీ అయ్యాయని గుర్తుచేశారు. చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటాల స్ఫూర్తితో భూ పోరాటాలకు పదును పెట్టాలని పిలుపు నిచ్చారు. వామపక్షాల నాయకత్వంలో పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయింపుల్లో కేంద్రం కోత పెడుతోందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడానికి, కూలి పెంపునకు ఐక్యంగా పోరాడాలన్నారు.
ధరలు పెంచి ప్రజలను లూటీచేస్తున్న ప్రభుత్వాలు
వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.శివ నాగరాణి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.శివ నాగరాణి మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు మరోపక్క ధరలు పెంచి ప్రజల జేబులు లూటీ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.450 ఉండే గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.1200 అయిందని, రూ.80 ఉండే నూనె ప్యాకెట్‌ ధర రూ.175కు చేరిందని అన్నారు. డ్వాక్రా గ్రూపులకు ఇస్తున్న రుణాలు విద్య, వైద్యం తదితర కుటుంబ అవసరాలకు ఖర్చయిపోతున్నాయని, పేద కుటుంబాలు అప్పులు పాలవుతున్నాయని పేర్కొన్నారు. పేదలకు సెంటు భూమిని ఇళ్ల స్థలాలుగా ఇవ్వడం అన్యాయమని, కనీసం ఐదు సెంట్ల భూమిని పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పనులు చేసేవారికి చాలీచాలని కూలి ఇస్తున్నారన్నారు. రోజు కూలి రూ.600కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
పెద్దల చేతుల్లోకి అసైన్డ్‌, సముద్రతీర బంజరులు, లంకభూములు
వ్యకాస కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.రఘు
వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.రఘు మాట్లాడుతూ రాజకీయాల్లో నిరుద్యోగం, ఉపాధి, విద్య తదితర ప్రజా సమస్యలపై చర్చ లేకుండా పోయిందన్నారు. జిల్లాలో వేలాది ఎకరాల ఎస్సైన్డ్‌ భూములు, సముద్ర తీర బంజరులు, లంక భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. పెద్దల ఆక్రమణలో ఉన్న భూములు పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ చల్లపల్లి, మోపిదేవి, పామర్రు, నందివాడ మండలాల్లో భూ పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. ఉపాధి పనులు, భూసమస్య, దళితుల శ్మశాన వాటికలకు భూముల కేటాయింపు తదితర సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు.
పెద్దల చేతుల్లోకి వెళ్లిన అసైన్డు భూములను తిరిగి పేదలకు పంచాలి
వ్యకాస కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి మురాల రాజేష్‌
వ్యకాస కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి మురాల రాజేష్‌ మాట్లాడుతూ జిల్లాలో లక్ష ఎకరాలు భూములు పెద్దల ఆక్రమణలో ఉన్నాయన్నారు. 9/77 చట్టం పటిష్టంగా అమలు చేసి పెద్దల చేతుల్లోకి వెళ్లిన ఎస్సైన్డ్‌ భూములను తిరిగి పేదలకు పంపిణీ చేయాలన్నారు.
ఉపాధి పని ప్రదేశాల్లో సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం
ఐద్వా కృష్ణాజిల్లా కార్యదర్శి జ్యోతి
ఐద్వా కృష్ణాజిల్లా కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ ఉపాధి పనులు చేసే మహిళలకు అవసరమైన సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఉపాధి పని ప్రదేశాల్లో మౌలిక వసతుల కల్పనకు వ్యవసాయ కార్మిక సంఘంతో కలిపి ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.
వ్యకాస వ్యవస్థాపకుల్లో గుంటూరు బాపనయ్య ఒకరు
కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణ
కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపకుల్లో గుంటూరు బాపనయ్య ఒకరని గుర్తుచేశారు. వ్యకాస కృష్ణాజిల్లా అధ్యక్షులు డి.సంగీతరావు, ఆహాన సంఘం అధ్యక్షులు పాగోలు రమేష్‌ తదితరులు సభలో మాట్లాడారు.