Nov 16,2023 00:17

వరికపూడి శెల ప్రాజెక్టు నమూనానుపరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడులో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 34 గ్రామాలకు 1.04 లక్షల ఎకరాలకు సాగు నీరు, లక్ష మంది ప్రజలకు సాగు నీరు అందించేందుకు ఉద్దేశించిన వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని దశల వారీగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌ పల్నాడు కరువు నివారణ పథకం కింద రూ.340.26 కోట్లతో చేపడుతున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి సిఎం జగన్‌ బుధవారం మాచర్లలో శంకుస్థాపన చేశారు. మాచర్లలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 100 పడకల స్థాయికి పెంచేందుకు అనుమతిస్తున్నట్టు ఈ సందర్భంగా సిఎం ప్రకటించారు. ఇప్పటికే పల్నాడును ప్రత్యేక జిల్లా చేయడమే కాకుండా పిడుగురాళ్ల వద్ద మెడికల్‌ కాలేజిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. పేదలకు టిడిపి వ్యతిరేకమని, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవడమే అని చంద్రబాబు వ్యాఖ్యానించారని, అయితే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అమలు చేసి చూపించిన తరువాత ఇప్పుడు అన్ని పార్టీలూ అదే బాటలో పయనిస్తున్నాయని అన్నారు. రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ మొదటి సంతకంతో చేస్తానన్న చంద్రబాబు దాన్ని విస్మరించడంతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేయలేదని, రైతులను అడ్డగోలుగా మోసం చేసిన చంద్రబాబును నమ్మగలమా అని వ్యాఖ్యానించారు. తన బినామీ భూములు బాగా పెరగాలన్న దుర్భుద్ధితో అమరావతిని ఒక రాజధానిగా భ్రమ కల్పించారని, చంద్రబాబు పేదలకు కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. అయితే వైసిపి హయాంలో 31 లక్షల ఇంటి స్థలాలను అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపేందుకు కేసులు వేశారని, కులాల మధ్య సముతుల్యం దెబ్బతింటోందని, ఏకంగా ఎదురు దాడి చేసిన వ్యక్తి చంద్రబాబు అని, ఇటువంటి వ్యక్తి హయాంలో ఏ పేదవాడికైనా మంచి జరుగుతుందా? అని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి భవిష్యత్‌లో ఎంతో చేస్తానంటే నమ్మగలమా? అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం వాగ్దానాలు అమలు చేశామని, ప్రతి ఇంటికి వెళ్లి మేనిఫెస్టోను అమలు తీరును వివరించాలని అన్నారు. దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేయించి, అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ షేక్‌ చేసినా, ఎస్‌ వోఎస్‌ నొక్కినా 10 నిమిషాల్లో పోలీసులు వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు. తనకు ఏ పార్టీతో పొత్తులేదని, కేవలం ప్రజలతోనేనని తెలిపారు.
ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కుట్ర, కుయుక్తులు ప్రజలు నమ్మరని, ప్రజల గుండెల్లో జగన్‌కు సుస్థిర స్థానం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. కరువు, కాటకాలకు నిలయంగా ఉండే పల్నాడు ప్రాంతంలో చంద్రబాబు 15 ఏళ్ల పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. వరికపూడిశెలకు రెండుసార్లు ఉత్తిత్తి శంకుస్థాపనలు చేశారని, ప్రాజెక్ట్‌ నిర్మాణానికి తొలిగా అటవీ శాఖ అనుమతులు కావాల్సి ఉన్నా అవి లేకుండా శంకుస్థాపన చేసి ప్రజల్ని మోసగించారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 2016లో ఇచ్చిన మాట రపకారం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేంద్ర అటవీ శాఖ అనుమతులు, పర్యావరణ అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ మొదటి దశ రూ.340 కోట్లతో 24.9 వేల ఎకరాలకు సాగు నీరు, 34 గ్రామాలకు తాగునీరు అందిస్తుందని, రెండో దశలో రూ3,400 కోట్లతో బోల్లాపల్లి, పుల్లలచెరువు మండలాలతో కలుపుకుని లక్ష ఎకరాలకు సాగు నీరు, అనేక గ్రామాలకు త్రాగునీరు అందిస్తుందని వివరించారు. మారుమూల తండాలు, వెనుకబడిన గ్రామాలు అధికంగా ఉన్న నియోజకవర్గానికి 50 పడకల ఆసుపత్రి సరిపోవటం లేదని, 100 పడకల ఆసుపత్రిగా మార్పు చేయాలని సిఎంని కోరగా ఆయన అంగీకరించారు. అనేక గ్రామాలకు రహదారుల నిర్మాణానికి అడిగిన నిధులు, పేటసన్నిగండ్ల ఎత్తిపోతల పధకం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ సమయం నుండి పిడబ్ల్యూడి కాలనీలో నివాసం ఉంటున్న క్వార్టర్స్‌ వారికే ఇవ్వాలని కోరగా సిఎం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పిన్నెల్లి సోదరులు నాగలి, జలయజ్ఞం జ్ఞాపికను బహూకరించారు. కాపు కార్పోరేషన్‌ నాయకులు వెంకటేశ్వర స్వామి చిత్ర పటాన్ని సిఎంకు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, విడదల రజనీ, ఆదిమూలపు సురేష్‌, ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌, ఐజి పాలరాజ్‌, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, కల్పలత, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరు శంకరరావు, వైసిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, టిజివి కృష్ణారెడ్డి, మండెపూడి పురుషోత్తం పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు
మాచర్లలో సిఎం వైఎస్‌ జగన్‌ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. హెలిప్యాడ్‌ నుంచి సభాస్థలి వరకు బస్సులో వచ్చిన సిఎంకు రోడ్డుకు ఇరువైపులా పెద్దసంఖ్యలో మహిళలు స్వాగతం పలికారు. సభా ప్రాంగణం నిండిపోవడంతో రోడ్డుపైన జనసందోహం కన్పించింది. సభా ప్రాంగణం నుంచి ప్రధాన రహదారి ఇరువైపులా ప్రజలు సిఎం జగన్‌పైపూల వర్షం కురిపించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ జనసమీకరణ జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుచూసి సిఎం అభివాదం చేశారు.