ప్రజాశక్తి-కాకినాడ తమ సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థ క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) డ్రైవర్స్ దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. బుధవారం డ్రైవర్స్ మస్తర్ పాయింట్ వద్ద యూనియన్ అధ్యక్షుడు ఎం.శివశంకర్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. డ్రైవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహనాలను ప్రవేశపెట్టిందన్నారు. కానీ ఆ వాహన డ్రైవర్లకు చాలీచాలని జీతాలు అందుతున్నాయన్నారు. కార్మిక చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఒ నెంబర్ 7 ప్రకారం కనీస వేతనం రూ.18500 చెల్లించాలని, వారాంతపు సెలవులు అమలు చేయాలని, పిఎఫ్ ఇఎస్‌ఐ కచ్చితంగా జమ చేయాలని, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేయించాలని, మెడికల్ లీవులు ఇప్పించాలని కోరుతున్నా క్లాప్ వాహన కాంట్రాక్టర్స్ సక్రమంగా స్పందించడం లేదన్నారు. ప్రతి నెలా 5వ తేదీ లోపు జీతాలు చెల్లించాలని ఎంఎల్‌ఎ అధికారుల సమక్షంలో యాజమాన్య ప్రతినిధులను ఆదేశించినా అమలు కావడం లేదన్నారు. 20న తర్వాతే జీతాలు అందుతున్నాయని తెలిపారు. మరొక పక్క నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఈ నేపథ్యంలో ప్రభుత్వ జిఒ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ఎస్.అభి, ఎన్.గంగాధర్, టి.సూరిబాబు, టి.శ్రీనివాస్, టి. గంగాధర్, ఎం. పెద అప్పన్న, ఎన్. సూరిబాబు, నాని బాబు, భైరవస్వామి, విక్టర్, రాము, భద్ర, తదితరులు పాల్గొన్నారు.










