
సంపన్నులకు వున్నట్లుగా, వాస్తవాదాయాల్లో ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి పేదలకు మరే ఇతర యంత్రాంగాలు వుండవు. అందువల్ల సాధారణంగా పేదల నుండి సంపన్నులకు ఆదాయం బదిలీ కావడానికి ఈ ద్రవ్యోల్బణం దారి తీస్తుంది. మార్కెట్‌పై నియంత్రణ కలిగిన కార్పొరేట్లు అధిక ఉపకరణాల వ్యయ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తారు. మరో పక్క తమ లాభాలను మాత్రం అలాగే కొనసాగిస్తూ వుంటారు.
ప్రస్తుతం దేశం ద్రవ్యోల్బణం గుప్పెట్లో నలుగుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా, గ్రామీణ, పట్టణ పేదలపై ఈ భారం మరింతగా పెరిగి వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి.
మే మాసానికి రిటైల్ ద్రవ్యోల్బణం 7.8 శాతంగా వుంది. గత ఎనిమిదేళ్ళలో ఇదే అత్యధికం. ఆహార ధరల ద్రవ్యోల్బణం 8.38 శాతంగా వుంది. గత 17 మాసాల్లో ఇదే అత్యధికంగా నమోదైంది. ఏప్రిల్‌లో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం ఏకంగా 15.08 శాతానికి పెరిగింది. ప్రస్తుత 2011-12 సిరీస్‌ల్లో ఇదే అత్యధికంగా వుంది.
ఇలా పొడి పొడిగా గణాంకాలు పేర్కొనడం వల్ల సామాన్యులకు ముఖ్యంగా పేదలకు అర్ధమయ్యేదేమిటి? వాస్తవానికి, ఇవి ఇలా పెరిగాయంటే గోధుమ పిండి, కూరగాయలు, ఖాద్య తైలాలు, వంట గ్యాస్ వంటి వాటి ధరలు పెరిగాయని అర్ధం. దీనివల్ల పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాల వారు తక్కువ తినాల్సి వస్తోందని అర్ధమవుతోంది. వారి పిల్లలకు పోషకాహారం పెట్టడంలో విఫలమవుతున్నారు. కనీస స్థాయిలో బతకడానికి అవసరమైన వస్తువులను కూడా కొనలేని నిస్సహాయత వారిని ఆవరిస్తోంది. ఉత్తర భారతంలో ప్రధాన ఆహారమైన గోధుమల ధర ఏడాది కాలంలో (2021 మే-2022 మే) 13 శాతం పెరిగింది. పాల ధర లీటరుకు రూ.50 పైనే వుంటోంది. వంట నూనెల ధరలు లీటరుకు దాదాపు రూ.200గా వున్నాయి. సీజనులో వచ్చే కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.
ద్రవ్యోల్బణం అంటే లక్షలాదిమంది ప్రజలు - వీధుల్లో తిరిగి అమ్ముకునేవారు, చిన్నా చితక పనులు చేసుకునేవారు, చిన్నగా వ్యాపారాలు చేసుకునేవారు-జీవనోపాధి కోల్పోవడమే. చిన్న, సూక్ష్మ తరహా సంస్థలను ఈ ద్రవ్యోల్బణం బాగా దెబ్బతీస్తోంది.
ఈ ద్రవ్యోల్బణ విష వలయానికి దోహదపడే ఏకైక అతి పెద్ద అంశమేమంటే ఇంధన ధరలు విపరీతంగా పెరగడం. పెట్రోల్, డీజిల్, ద్రవరూపం లోని గ్యాస్‌లపై కేంద్ర పన్నులు నెమ్మదిగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానం కారణంగా వీటి ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇది ఉక్రెయిన్ యుద్ధానికి చాలా ముందుగానే ప్రారంభమైంది. తర్వాత వచ్చిన యుద్ధం ఈ పరిస్థితిని మరింత దుర్భరం చేయడానికి దారి తీసింది. ఇంధనమనేది సార్వజనీన వస్తువైనందున పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అన్ని వస్తువుల ధరలపై ప్రభావాన్ని చూపుతుంది.
పెట్రోల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాల్లో 96 శాతం, డీజిల్‌పై 94 శాతం సెస్సులు, సర్‌ఛార్జీలే వున్నాయనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. అన్నింటికంటే దారుణమైనది వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం. ఇళ్ళలో వాడుకునే 14.2 కిలోల సిలిండర్ ధర ఏడాది కాలంలో 76 శాతం అంటే రూ.431.50 పెరిగింది. వాణిజ్యావసరాల కోసం వాడే 19 కిలోల సిలిండర్ ధర 126 శాతం పెరిగి రూ.2,397కి చేరింది.
ద్రవ్యోల్బణం ఇంత ఆందోళనకర స్థాయిలో పెరిగినా మోడీ ప్రభుత్వం దిగ్భ్రాంతికరమైన రీతిలో నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తోంది. ఏప్రిల్ మాసానికి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల చేసిన రోజే, సంపన్నులతో పోలిస్తే అధిక ధరలతో పేదలు ఇబ్బంది పడేది తక్కువేనని చెప్పడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రయత్నించింది. ఏప్రిల్ మాసానికి నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదికలో ఈ విషయం పేర్కొంది. ''అధికాదాయ గ్రూపుల కన్నా తక్కువ ఆదాయ గ్రూపులవారిపై భారత్ లోని ద్రవ్యోల్బణం చూపించే ప్రభావం తక్కువేనని వినిమయ ధోరణులపై కనిపిస్తున్న సాక్ష్యాధారాలు పేర్కొంటున్నాయి.'' అని ఆ నివేదిక తెలిపింది. వినిమయ వ్యయాన్ని ఆధారంగా చేసుకుంటే, వివిధ వర్గాల వారీగా 20 శాతం మంది అధిక ఆదాయ వర్గాల వారు, 20 శాతం మంది పేదలు, 60 శాతం మంది మధ్య తరగతి వారిపై రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభావం వుంటుందని పేర్కొనడం ద్వారా ఆ నివేదిక ఈ నిర్ధారణకు వచ్చింది.
ఈ నిర్ధారణ లోని బూటకాన్ని ఒక విశ్లేషణ ద్వారా తెర మీదకు తీసుకురావచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివిధ వినిమయ వర్గాల్లో వాస్తవ ద్రవ్యోల్బణం రేటులో మార్పును నెలవారీ ఆర్థిక నివేదిక స్పష్టంగా తెలియచేస్తోంది. ద్రవ్యోల్బణమంటేనే ధరల పెరుగుదల, ఏడాదిలో పట్టణ పేదలకు ఈ రేటు అధికంగా వుంటే, ఆ తర్వాతి సంవత్సరంలో అది సాపేక్షంగా తగ్గుతుంది. వాస్తవ ద్రవ్యోల్బణ రేటు తగ్గినప్పటికీ ధరల రీత్యా చూసినట్లైతే ఈ రెండింటి ప్రభావం అధికంగా వుంటుంది. ఉదాహరణకు, పట్టణ పేదలకు తొలి ధర 100గా వుంటే వచ్చే ఏడాదిలో 6.8 శాతం పెరిగి తర్వాతి సంవత్సరానికి 106.8గా మారుతుంది. అప్పుడు వాస్తవ ద్రవ్యోల్బణం రేటు 5.7 శాతానికి తగ్గితే, పై నివేదిక సూచించినట్లుగా, మూడో సంవత్సరం చివరిలో వాస్తవ ద్రవ్యోల్బణం ధర 112.89గా మారుతుంది (106.8పై 5.7శాతం).అంటే మొదటి సంవత్సరంలో 100గా వున్న ధర మూడో సంవత్సరం వచ్చేసరికి 112.89గా మారుతోంది. అన్ని వినిమయ వర్గాల్లోని వారికన్నా ఇది చాలా ఎక్కువగా వుంది. పై నివేదిక ఈ విషయాన్ని మోసపూరితంగా దాచి పెడుతోంది. పట్టణ, గ్రామీణ వర్గాల వారికి, అన్ని గ్రూపుల వారికి ధరలు పెరిగినప్పటికీ సాపేక్షంగా చూసినట్లైతే ఇతర కేటగిరీల వారికి ఈ ప్రభావం చాలా తక్కువగా వుంటుంది. అందువల్ల వాస్తవ ద్రవ్యోల్బణం రేటు 6.8 శాతం నుండి 5.7 శాతానికి తగ్గినప్పటికీ పట్టణ పేదలు మరింత దారుణంగా దెబ్బతింటారు.
సంపన్నులనే మరింత ఎక్కువగా ద్రవ్యోల్బణం ప్రభావితం చేస్తుందన్న ఆలోచన లేదా వాదనను నిలదీయాల్సి వుంటుంది. ఆధారపడేందుకు పెద్దగా పొదుపు మొత్తాలు లేకుండా, కేవలం వేతనాదాయాలు కలిగిన వారిని ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణానికి సంబంధించి పెద్ద మొత్తంలో ఆహారం కొనుగోలు చేసేవారిని నేరుగా ఈ ద్రవ్యోల్బణం దెబ్బ తీస్తుంది. ఇక సంపన్న, ఎగువ మధ్య తరగతి వర్గాల వారు ఆర్థిక సాధనాలు, స్టాక్ మార్కెట్‌ల ద్వారా తమ ఆదాయాలను కాపాడుకోగలుగుతారు. ఈ స్టాక్ మార్కెట్లలో ద్రవ్యోల్బణం రేటుతో పాటు ధరలు కూడా పెరుగుతాయి. అందువల్ల వారు చాలా వరకు తమ ఆదాయాలను రక్షించుకోగలుగుతారు.
సంపన్నులకు వున్నట్లుగా, వాస్తవాదాయాల్లో ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి పేదలకు మరే ఇతర యంత్రాంగాలు వుండవు. అందువల్ల సాధారణంగా పేదల నుండి సంపన్నులకు ఆదాయం బదిలీ కావడానికి ఈ ద్రవ్యోల్బణం దారి తీస్తుంది. మార్కెట్‌పై నియంత్రణ కలిగిన కార్పొరేట్లు అధిక ఉపకరణాల వ్యయ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తారు. మరో పక్క తమ లాభాలను మాత్రం అలాగే కొనసాగిస్తూ వుంటారు. పైగా, ద్రవ్యోల్బణం కారణంగా సేవర్స్ వాస్తవ వడ్డీ ఆదాయాలు తగ్గుతాయి. రుణగ్రహీతలు మాత్రం సమర్ధవంతమైన రీతిలో తక్కువ వడ్డీ రేట్లను చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ ప్రధానంగా సేవర్స్ అంటే కార్మిక వర్గ ప్రజలు, పెట్టుబడిదారులు అంటే రుణ గ్రహీతలైనందున ఇక్కడ కూడా కార్మిక వర్గ ప్రజలే ఎక్కుగా ఇబ్బందులు పడతారు.
ధరల పెరుగుదలపై పోరాడేందుకు, పెట్రోలియం ఉత్పత్తులపై అన్ని సర్‌చార్జిలను, సెస్సులను తక్షణమే ఉపసంహరించాలని వామపక్షాలు పిలుపిచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులోకి తీసుకురావడానికి ఇదొక్కటే మార్గమని పేర్కొంటున్నాయి. అన్ని నిత్యావసరాలను, ముఖ్యంగా వంటనూనెలు, పప్పు ధాన్యాలను సరఫరా చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని వామపక్షాలు పిలుపిచ్చాయి. గత రెండేళ్ళుగా కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రజల ఆదాయాలు, జీవనోపాధులు మరింత నష్టపోయి అధ్వాన్నంగా మారిన నేపథ్యంలో ఆదాయ పన్ను చెల్లించని కుటుంబాలన్నింటికీ నెలకు రూ.7500 నగదు బదిలీ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ధరల పెరుగుదలకు కళ్ళెం వేయడంతో పాటుగా నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని వామపక్షాలు కోరుతున్నాయి. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు ఇదే ప్రాధాన్యతా ఎజెండాగా మారాలి. ఈ డిమాండ్లపై మే 25-31 తేదీల్లో దేశవ్యాప్త పోరాటాలకు వామపక్షాలు పిలుపిచ్చాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా జరిపే ఇటువంటి పోరాటాలు దేశవ్యాప్తంగా విస్తరించాల్సి వుంది, ముమ్మరంగా చేపట్టాల్సి వుంది.
( 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)