Feb 18,2023 21:00

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌

 

దర్శనం వేగవంతమయ్యేలా చర్యలు
- భక్తులకు ఇబ్బంది కలిగించరాదు
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌
ప్రజాశక్తి - శ్రీశైలం

      మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లన్న దర్శనార్థమై వచ్చే సామాన్య భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా దర్శనమయ్యేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులకు జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌ సూచించారు. శనివారం శ్రీశైలం దేవస్థానంలోని గంగాధర మండపం వద్ద నుండి శ్రీ కృష్ణదేవరాయ గోపురం వరకు నడుచుకుంటూ వెళ్లి మెడికల్‌ క్యాంపును కలెక్టర్‌ సందర్శించారు. వైద్యసిబ్బందితో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యూలైన్లలోని భక్తులతో కలెక్టర్‌ సంభాషిస్తూ ఏర్పాట్లపై ఆరా తీశారు. క్యూలైన్లలో కొన్నిచోట్ల మంచినీటి సరఫరా కొరత ఉన్నట్లు భక్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనేచ యుద్దప్రాతిపదికన క్యూలైన్లలో మంచినీటి సదుపాయాన్ని కలెక్టర్‌ కల్పించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణం, బ్రహ్మానందరాయ గోపురం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లను పరిశీలించారు. తదుపరి పాగాలంకరణ, స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీరు వి.రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీరు నరసింహారెడ్డిలకు కలెక్టర్‌ పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి రఘవీర్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌. లవన్న తదితరులు పాల్గొన్నారు.