Oct 09,2023 21:26

డ్రోన్‌ స్ప్రేయింగ్‌పై అవగాహన కల్పిస్తున్న అధికారులు

          ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం    డ్రోన్‌ స్ప్రేయింగ్‌ ద్వారా రైతుకు అధిక దిగుబడి వచ్చి ఆదాయం పెరుగుతుందని పెద్దపల్లి సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్‌ కిషోర్‌రెడ్డి తెలిపారు. సోమవారం తాడిపత్రి రూరల్‌ మండలం దిగువపల్లి గ్రామంలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డ్రోన్‌ ద్వారా 15 ఎకరాల ఆముదం పంటలో స్ప్రేయింగ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో రైతులందరూ వ్యవసాయ యాంత్రీకరణను అవలంభించుకోవాలని సూచించారు. ఒక ఎకరాకు డ్రోన్‌ స్ప్రేయింగ్‌తో 10 లీటర్ల నీటిని మాత్రమే ఉపయోగించి పురుగులు తెగుళ్ల మందులను వాడవచ్చన్నారు. పురుగుమందు కూడా 25 శాతం తగ్గించి పది లీటర్లలో కలుపుకుని స్ప్రే చేయాలని సూచించారు. అనంతరం పత్తి పంటలో గులాబీ రంగు పురుగు యాజమాన్యంపై అవగాహన కల్పించారు. ప్రతి రైతూ పత్తి పంటలో ఫేరమోన్‌ ట్రాప్‌లు 15 నుంచి 20 చొప్పున ఒక ఎకరాకి పెట్టుకోవాలని తెలిపారు. పర్యావరణ రహిత యాజమాన్య పద్ధతులను రైతులందరూ తెలుసుకుని వారి పొలాల్లో అనుసరించాలని కోరారు.