Dec 27,2022 22:53

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఏపీ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల డిప్యూటీ కమిషనర్‌ టి.శ్రీనివాసరావు చెప్పారు. మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి భవిష్యత్‌ను శూన్యం చేసుకోవద్దని ఆయన విద్యార్ధులకు హితవు పలికారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలు, ఏపీ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఎన్టీఆర్‌ జిల్లా డివిజన్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం 'యాంటీ డ్రగ్‌ డ్రైవ్‌' అంశంపై సదస్సును కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవ జీవితంలో విద్యార్ధి దశ చాలా కీలకమైనదన్నారు. ఈ దశలో మత్తుకు అలవాటు పడితే ఆ జీవితం చెడుబాట పడుతుందన్నారు. మత్తుకు దూరంగా ఉండే విధంగా యువతను చైతన్యవంతం చేసేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. యువత లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధనకు పాటుపడాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జిల్లా ఏఈఎస్‌ డి.ప్రభాకరరావు మాట్లాడుతూ యువత విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి జీవితంలో స్థిరపడేందుకు అవసరమైన ఉపాధిని పొందాలన్నారు. ఆ దిశగా తమ ప్రయాణం కొనసాగాలని సూచించారు. ఎస్‌ఈబీ భవానీపురం సీఐ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్ధులు ఎటువంటి తప్పుడు అడుగులు వేసినా వారి జీవితం తీవ్రంగా ప్రభావితమవుతుందన్నారు. విద్యార్ధులు మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు మాట్లాడుతూ యువత ఏమాత్రం తప్పటడుగులు వేసి మత్తుకు అలవాటు పడితే దేశాభ్యున్నతి సైతం కుంటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-1 ప్రొగ్రామ్‌ ఆఫీసర్‌ వి.శేషగిరిరావు స్వాగతం పలకగా, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రామ్‌ ఆఫీసర్లు డి.పవన్‌కుమార్‌, ఎన్‌.సాంబశివరావు తదితరులు ప్రసంగించారు.