Jun 27,2023 00:31

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా కరస్పాండెంట్‌ : దేశ భవిష్యత్‌ యువత మీద ఆధారపడి ఉందని మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, ఎస్సీ వై.రవిశంకర్‌రెడ్డి సూచించారు. సోమవారం 'అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం' సందర్భంగా స్థానిక కోటప్పకొండ రోడ్డులోని నరసరావుపేట ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 144 దేశాలలో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. మెట్రోపాలిటన్‌ నగరాలు, పట్టణాలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతుందని ఆందోళన వెలిబుచ్చారు. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని, సమాజాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ కొంతమంది కొత్త పరిచయాల ద్వారా డ్రగ్స్‌ సేవించడం మొదలు పెడతారని, తర్వాత వాటికి బానిసలై చోరీలు, ఇతర నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. సమాజాన్ని నిర్వీర్యం చేసే డ్రగ్స్‌ను ఏ రూపంలో ఉన్నా వాటిని తుదముట్టించాలన్నారు. డ్రగ్స్‌ను వాడి ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పారు. మాదకద్రవ్యాలు వినియోగించే వారికి కఠిన శిక్షలు ఉంటాయన్నారు. విద్యాసంస్థల వద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి డ్రగ్స్‌ అనర్థాలపై చైతన్యం తెస్తున్నామని, ప్రత్యేక ప్రణాళికలతో డ్రగ్స్‌ కట్టడికి కృషి చేస్తామని చెప్పారు. డ్రగ్‌ కేసుల్లో పట్టుబడి పోలీసు రికార్డుల్లో పేరు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరని, పాస్‌పోర్ట్‌, వీసాలు రావని తెలిపారు. ఎవరైనా డ్రగ్‌ అడిక్షన్‌ నుండి బయట పడాలంటే పోలీస్‌ శాఖ నుండి సహాయం చేస్తామని తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, అమ్మకాలపై సమాచారం తెలిపిన వరికి తగిన నగదు బహుమతి ఇస్తామని, సమాచారాన్ని స్థానిక పోలీసులకు లేదా డయల్‌ 112కు లేదా డయల్‌ 100కు తెలపాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల తలెత్తె దుష్పరిణామాలపై ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ కుమార్‌ వివరించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ మిట్టపల్లి కోటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ రవికాంత్‌, ఎస్‌ఇబి ఎఎస్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖాధికారి వి.శ్రీనివాస్‌, డీఎస్పీ కెవి మహేష్‌, రూరల్‌ సిఐ భక్తవత్సలరెడ్డి, ఎస్‌ఐలు, ఎఇఎస్‌ దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.