గుజరాత్ ముంద్రా పోర్టులో గత నెల 16న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా రవాణా చేస్తున్న మూడు టన్నుల అతి ప్రమాదకర హెరాయిన్ పట్టుబడటంతో ఒక్క సారిగా దేశం కలవరపాటుకు లోనైంది. సీజ్ చేసిన హెరాయిన్ విలువ రూ. 21 వేల కోట్లు. ఇంతటి భారీ స్థాయిలో డ్రగ్స్ దొరకడం ఆందోళనకరం కాగా ఆ వ్యవహారానికి మన విజయవాడతో లింక్ బయట పడటం మనల్ని బెంబేలెత్తించే అంశం. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ ద్వారా బెజవాడ లోని ఆషీ ట్రేడింగ్ కంపెనీకి రవాణా చేసే నిమిత్తం ముంద్రా పోర్టుకు హెరాయిన్ వచ్చిందని డిఆర్‌ఐ తేల్చింది. ఆషీ ట్రేడింగ్ కంపెనీ ఓనర్ సుధాకర్, ఆయన భార్య వైశాలిలను చెన్నయిలో పోలీసులు అరెస్టు చేశారు. అంత పెద్ద నార్కొటిక్స్ కేసులో ఇరవై రోజుల్లో చేధించిందింతే. ముంద్రా పోర్టును నిర్వహించే అదానీ గ్రూపును కనీసం విచారించింది లేదు. నార్కొటిక్స్ స్పెషల్ కోర్టు ముంద్రా యాజమాన్యాన్ని ప్రశ్నించాలన్న ఆదేశాలకు విలువ లేదు. పోర్టు నిర్వహణ మినహా పోలీసింగ్ తమ బాధ్యత కాదని అదానీ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నారు. ఎ.పి పోలీస్ బాస్‌లేమో చిరునామా మినహా డ్రగ్స్ రవాణాతో రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని వీసమెత్తు ఇన్వెస్టిగేషన్ లేకుండానే ప్రకటించేశారు. టన్నుల కొద్ది హెరాయిన్ పట్టుబడిన ఉదంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ, రాష్ట్రీయ దర్యాప్తు సంస్థలు చేవ చచ్చినట్లు వ్యవహరిస్తూ ఎవరినో మెప్పించి ఒప్పించే పనిలో పడ్డాక ఇక మాదక ద్రవ్యాలు నేరుగా మన నట్టింట్లోకి రాకుండా ఉంటాయా ?
ముంద్రానే కాదు నలుదిక్కుల నుండి హెరాయిన్, కొకైన్, గంజాయి వంటి భయంకర మత్తు పదార్ధాలు దేశంలోకి చొచ్చుకొస్తున్నాయి. ముంద్రా విచారణ సమయంలోనే నోయిడా, సిమ్లా, హైదరాబాద్, బెంగళూరు, హిందూపురం వద్ద ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో రూ.కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నారు. భూమి, సముద్రం, ఆకాశం అన్ని మార్గాల్లో మత్తు పదార్ధాలు నిరాటంకంగా వచ్చి పడుతున్నాయి. పొరపాటున దొరికినప్పుడే కొన్ని రోజులు మీడియాలో ప్రచారం, ఒకరిద్దరి అరెస్టులు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం, దాన్ని అమలు చేసే నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), ఇ.డి, డిఆర్‌ఐ ఇత్యాది సంస్థలు అసలు ఉన్నాయో లేదోనన్న అనుమానం పెద్ద మొత్తంలో పట్టుబడుతున్న డ్రగ్స్ గురించి విన్నప్పుడు, మన కళ్ల ముందే యథేచ్ఛగా వాటిని వాడుతున్న వారిని చూసినప్పుడు సంశయం కలుగుతుంది. ప్రతి చిన్నదానికి 'మన్ కీ బాత్'లు నిర్వహించే ప్రధాని మోడీ యువతను నిర్వీర్యం చేసే, దేశ భద్రతకు పెనుముప్పుగా తయారైన డ్రగ్స్ అక్రమ రవాణాపై నోరు మెదపట్లేదు. ముంద్రా సంఘటన తర్వాత సైతం ఆయన గొంతు పెగల్లేదు. అదానీ పోర్టు విచారణపైనా మోడీ, అమిత్‌షాలది నిశ్శబ్దమే. 18 మాసాలుగా ఎన్‌సిబి కి పూర్తి స్థాయి డైరెక్టర్ లేరంటే మాదక ద్రవ్యాల నిరోధంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏమిటో అర్ధమవుతుంది.
ప్రపంచీకరణ విధానాల అమలు పెరుగుతున్నకొద్ది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వాడకం, వినియోగించే వారి సంఖ్య విస్తరిస్తోంది. అందుకు మన దేశం మినహాయింపు కాదు. ఐక్యరాజ్యసమితి సహా పలు సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. డ్రగ్స్‌తో నేరాలు పెరుగుతున్నాయి. ఇండియాలో యువత అత్యధిక ఆత్మహత్యలకు డ్రగ్స్ కారణం. నయా-ఉదారవాద విధానాలు పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, ఉపాధి రహిత అభివృద్ధిని, ఆర్థిక, సామాజిక, రాజకీయ అంతరాలను పెంచుతున్నాయి. కరోనా వంటి వేళల్లో వాటి పాళ్లు ఇంకా ఎక్కువ. భవిష్యత్తు అయోమయంగా, నిరాశాజనకంగా కనిపిస్తుండటంతో యువతలో అసంతృప్తి పెరుగుతోంది. ఈ పరిస్థితిని కొన్ని శక్తులు తమకు అనుకూలంగా మార్చుకొని మాఫియాలుగా మారి యువతను మాదక ద్రవ్యాలకు బానిసలు చేస్తున్నాయి. వెయ్యి ఆలోచనలు సంఘర్షించాల్సిన కళాశాల ప్రాంగణాలకు డ్రగ్స్ చేరుతున్నాయి. పాలకవర్గాల అండ లేకుండా ఇది అసాధ్యం. వారికి కావాల్సింది కూడా అదే. తమ విధానాలను యువత ప్రశ్నించకూడదు. తమ విధానాలతో లాభపడే అదానీ పోర్టుల వంటివి డ్రగ్స్ అక్రమ రవాణాకు ఉపకరిస్తాయి. ఇక్కడా జేబులు నింపుకుంటాయి. పాలక వర్గాలకు రెండందాల లాభం. సరళీకరణ విధానాలను వెనక్కి కొట్టనంతకాలం మాదక ద్రవ్యాలు 'శిఖండి' పాత్ర పోషిస్తూనే ఉంటాయి.










