May 29,2023 21:34

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఆదోని
ప్రభుత్వం కోట్లాది రూపాయలతో చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజల కోసమేనని, వాటికి ప్రజలు కూడా సహకారం అందించాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి కోరారు. ముఖ్యంగా మురుగు నీటి కాలువలను నిర్మిస్తే వాటిని వెంటనే ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. దీనివల్ల మురుగునీరు ప్రవాహానికి కూడా మార్గం లేకుండా పోతోందని అసహనం వ్యక్తం చేశారు. మురుగు నీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని కౌడల్‌పేట ప్రాంతంలో ఉన్న షేర్‌ఖాన్‌ కొట్టాల ప్రాంతంలో రూ.38 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ బోయ శాంత అధ్యక్షతన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మురుగునీటి కాలువల్లో పూడిక తొలగించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడ చూసినా మరుగు నీటి కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, దీనివల్ల వర్షపు నీరు ప్రవహించక కాలనీలోకి వస్తున్నాయని చెప్పారు. కాలనీలో వరద నీటిముంపునకు గురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. మురుగు నీటి కాలువలు నిర్మించిన తర్వాత వాటిపై ఎలాంటి ఆక్రమణలూ ఉండరాదని, మున్సిపల్‌ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డిని ఆదేశించారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని, ప్రస్తుతం రూ.38 కోట్లతో మురుగునీటి కాలువలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇంకా నిధులు అవసరమైతే 15వ ఆర్థిక సంఘం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్లు ఎంఎంజి.గౌస్‌, నరసింహులు, మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ మజర్‌ అహ్మద్‌, మాజీ కౌన్సిలర్‌ ఇబ్రహీం, షేర్‌ ఖాన్‌ రియాజ్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.