ప్రజాశక్తి-పాడేరు టౌన్: కుమ్మరిపుట్టు గ్రామంలో డ్రెయినేజీలు లేక పోవడంతో ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను శుక్రవారం ఐటిడిఎ స్పందనలో టిడిపి నాయకులు, కుమ్మరిపుట్టు గ్రామస్తులతో కలిసి వినతి పత్రం అందజేశారు. డ్రైనేజీలు లేక పోవడంతో అస్తవ్యస్తంగా ప్రవహిస్తున్న మురుగునీటితో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాఠశాలల్లో వినియోగిస్తున్న మురుగు నీరు గ్రామానికి చేరకుండా డ్రైనేజీ సదుపాయం కల్పించాలని, నిల్వ ఉన్న మురుగు నీటిని తొలగించి వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మురుగు నీటితో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, దోమలతో వ్యాధులు ప్రబలకుండా ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఇదే సమస్యపై స్పందనలో 2021 అక్టోబర్ 29న ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని వివరించారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని, లేకపోతే ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, గ్రామస్తులు కోడా వెంకటసురేష్, త్రినాథ్, నాగరాజు, అప్పలకొండ, ప్రసాద్, సలేబు సురేష్, కోటేశ్వరరావు, పుణ్యమూర్తి, నరసింహమూర్తి, చిన్ని, రమేష్, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.










