ప్రజాశక్తి:అరకులోయ రూరల్:మండల కేంద్రంలో విచ్చలవిడిగా గిరిజనేతరులు డ్రెయినేజిలపై అక్రమంగా ఇళ్లు, షాపులు, దుకాణాలు నిర్మించుకుని దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. మండల కేంద్రంలోని గిరిజన సంఘం కార్యాలయం ఎదుట, మయూరి సిల్క్ హౌస్, కొండ వీధి, స్టేట్ బ్యాంక్ వెళ్ళే రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీలపై గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పాదచారులు, వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. పంచాయతీ అధికారులు, స్ధానిక సర్పంచ్‌కు గతంలో గిరిజన సంఘం, ప్రజా సంఘాలు, సీపీఎం నాయకులు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకున్న పరిస్థితి లేదు. డ్రైనేజీలపై షాపులు, దుకాణాల మెట్లు, ఇళ్ళులు కూల్చుతామని పంచాయతీ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు తప్ప పట్టించుకున్న దాఖలాలు లేవు. పంచాయితీ అధికారులు నోటీసులకే పరిమితం అవుతున్నారు. ఓ గిరిజనుడు తాత్కాలితంగా చిన్న రేకు షెడ్లు వేసుకుంటే కూల్చేసే అధికారులు గిరిజనేతరులకు మాత్రం అనుమతులు ఇచ్చి వారికీ కొమ్ము కాస్తున్నారు.
ఖాళీ ప్రదేశాలను కొందరు గిరిజనేతరులు ఆక్రమణ చేసి కట్టడాలు నిర్మించుకుంటున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. డ్రైనేజ్ పై ఆక్రమణ చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మురుగు నీటి కాలువలో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లు తుందని స్థానికులు మండిపడుతున్నారు. పంచాయతీ అధికారుల అండదండాలతో గిరిజనేతరులు విచ్చల విడిగా బినామీ పేర్లతో కట్టడాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తక్షణం చర్యలు తీసుకొని, తొలగించాలని గిరిజన ప్రజా సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.










