Jul 09,2023 20:40

డ్రెయినేజీ కాలువ లేకుండా నిర్మించిన సిసి రోడ్లు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్‌
మండలంలోని కొన్ని గ్రామాల్లో డ్రెయినేజీ కాలువలు లేకుండా సిసి రోడ్లను నిర్మించారు. కె.తిమ్మాపురం గ్రామంలో సిసి రోడ్లు వేశారు.. కానీ డ్రెయినేజీ కాలువను మరిచారు. వర్షపు నీరు, మురుగునీరు ఇళ్లలోకి వస్తుండడంతో సిసి రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, పంచాయతీ రాజ్‌ ఎఇ, పంచాయతీ సెక్రటరీలు కూడా ప్రణాళిక లేకుండా పనులు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో వేసిన రోడ్లకు డ్రెయినేజీ కాలువలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో వేసిన సిసి రోడ్లకు డ్రెయినేజీ కాలువ లేకుండా నిర్మిస్తుండడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక లేకుండా అధికారులు చేస్తున్న పనులకు పర్యవేక్షకులు ఎవరు లేరా..? ప్రజాధనంతో పంచాయతీలో చేస్తున్న పనులపై పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
డ్రెయినేజీ లేకపోతే ఇబ్బంది
- నల్లారెడ్డి, తిమ్మాపురం గ్రామస్తుడు

సిసి రోడ్డుకు ఇరువైపులా డ్రెయినేజీ నిర్మించకపోతే ఇబ్బంది అవుతుంది. అధికారులను ప్రశ్నించినా పట్టించుకోకుండా ఇట్లే వేస్తామని అధికారులు సమాధానం చెప్పారు.
గత ప్రభుత్వం డ్రెయినేజీ నిర్మించారు
- కెటి.వెంకటేష్‌, తిమ్మాపురం గ్రామస్తుడు

గత ప్రభుత్వంలో సిసి రోడ్లు నిర్మించేటప్పుడు రోడ్డుకు ఇరువైపులా డ్రెయినేజీ కాలువలు నిర్మించారు. వర్షపు నీరు, మురుగునీరు రోడ్డుపైకి, ఇళ్లలోకి ప్రవేశించకుండగా డ్రెయినేజీ కాలువ గూండా పోయేవి. డ్రెయినేజీ కాలువ నిర్మించకుండా రోడ్లు వేయడం వల్ల రోడ్డు పక్కన ఇళ్లలోకి నీరు చేరుతోంది. ఇళ్లలోకి నీరు వస్తుండడంతో దుర్వాసనకు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది.