ప్రజాశక్తి - నందవరం
ముందు చూపు లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా అనధికారికంగా రాజకీయ నాయకుల ప్రోత్బలంతో ఇబ్రహీంపురం గ్రామం మాల వీధిలో డ్రెయినేజీ కాలువ నిర్మాణం పనులు చేపడుతున్నారని, రద్దు చేయాలని మాల మహానాడు కోరారు. బుధవారం మాల మహానాడు రాష్ట్ర నాయకులు గడ్డం నాగేంద్ర, రాయలసీమ అధ్యక్షులు ఎం.నరసప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి మధుబాబు గ్రామానికి వెళ్లి పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నందవరం ఎంపిడిఒ పంచాయతీ, పంచాయతీ సెక్రటరీలతో మాట్లాడి అనధికారికంగా నిర్మాణం చేపడుతున్న డ్రెయినేజీ కాలువ సమస్యలపై ఆరా తీశారు. గ్రామంలో ఎస్సీ మాల వీధి, మాదిగ వీధి మధ్యలో దాదాపు 20 ఏళ్ల క్రితమే డ్రెయినేజీ కాలువ ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డ్రెయినేజీ కాలవను రద్దు చేసి పల్లపు ప్రాంతం నుంచి మిట్ట ప్రాంతం వైపు ఉన్న మాల వీధిలోకి డ్రెయినేజీ కాలవను తీసుకెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఈ డ్రెయినేజీ కాలువ నిర్మాణం రద్దు చేయించాలని అధికారులను కోరారు. రెండు కాలనీల వాసులకు వివాదం తలెత్తకుండా డ్రెయినేజీ కాలువను ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం గ్రామంలో డ్రెయినేజీ కాలువను నందవరం ఎంపిడిఒ పరిశీలించి వివాదం లేకుండా పనులు చేయిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. అలాగే పల్లపు ప్రాంతం నుంచి మిట్ట ప్రాంతానికి మురుగునీరు ప్రవహించే విధంగా డ్రెయినేజీ కాలువను ఏర్పాటు చేస్తే స్థానిక మాల వీధి వాసులకు మురుగునీరు సాఫీగా కాకుండా కాలువలో నిలువ ఉండడంతో దుర్వాసనకు రోగాలను బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఇబ్రహీంపురం గ్రామ నాయకులు శేఖర్, రవి, బ్రహ్మయ్య, వీరేష్ పాల్గొన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న మాల మహానాడు నాయకులు










