ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో
విశాఖపట్నం కేంద్ర కార్యాలయంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డిసిఐఎల్)కు అరుదైన కాంట్రాక్టు దక్కింది. దీంతో డిసిఐ భవిష్యత్తు మనుగడకు ఊరట కలిగినట్టయింది. వైజాగ్ పోర్టు నుంచి రూ.57 కోట్ల శాండ్ ట్రాప్ డ్రెడ్జింగ్ (ఎస్‌టిడి) పనులు 2022 - 23 నుంచి మరో రెండు ఆర్థిక సంవత్సరాల పాటు నిర్వహించేలాగ అంటే 2024-2025 వరకూ ఉండేలాగ వైజాగ్ పోర్టు యాజమాన్యం సోమవారం అగ్రిమెంట్ చేసి అప్పగించింది. తాజాగా డిసిఐకి లభించిన ఈ కాంట్రాక్టుతో డిసిఐ 2022 - 2023 ఆర్థిక సంవత్సర లక్ష్యం రికార్డు స్థాయిలో రూ.1000 కోట్లకు చేరనుంది.
మెజారిటీ పోర్టుల షేర్లు కలిగి ఉన్న డిసిఐ
2017 వరకూ డిసిఐని ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే డిసిఐ ప్రయివేటీకరణపై విశాఖలోని కార్మిక వర్గం, వామపక్షాలు కలసికట్టుగా ఏడాదిన్నర కాలం పోరాడి దీన్ని ప్రభుత్వ రంగంలోనే ఉండేలా చేశాయి. దీంతో దేశంలో నాలుగు మేజర్ పోర్టుల కన్సోర్టియం (జెఎన్‌పిటి, పరదీప్, దీనదయాల్ పోర్టు, వైజాగ్ పోర్టు) కిందకు డిసిఐని కేంద్రం తీసుకురాక తప్పలేదు. దీంట్లో మేజర్ షేర్ కలిగిన వైజాగ్ పోర్టు ట్రస్ట్ (73 శాతం) నుంచి డ్రెడ్జింగ్ పనుల కాంట్రాక్టులు డిసిఐకి తాజాగా దక్కుతున్నాయి. పై నాలుగు పోర్టుల కింద లిస్టింగ్ కంపెనీగా డిసిఐ కొనసాగుతోంది. పోర్టులు నిత్యం నిర్వహించే ఎగుమతి, దిగుమతులు (ఎగ్జిమ్) కార్యకలాపాల డ్రెడ్జింగ్ పనుల కోసం డిసిఐ దేశంలోనే ఖ్యాతి గడించింది. ప్రపంచంలో డ్రెడ్జింగ్ కార్యకలాపాల నిర్వహణలో అరుదైన రికార్డులను నెలకొల్పిన చరిత్ర డిసిఐకి ఉంది. పోర్టుల ఎగ్జిమ్ కార్యకలాపాల కోసం నావిగేషనల్ చానెల్‌ను లోతుగా, సురక్షితంగా నిర్వహించడం ద్వారా దేశంలోని మేజర్ పోర్టులు, ఇండియన్ నేవీ, ఫిషింగ్ హార్బర్‌లు, ఇతర సముద్ర సంస్థలకు డ్రెడ్జింగ్ అనుబంధ సేవలను అందించే భారతదేశపు ప్రధాన డ్రెడ్జింగ్ సంస్థగా డిసిఐ వెలుగొందుతోంది.
పోర్టు నుంచి అరుదైన కాంట్రాక్టు
తాజాగా వైజాగ్ పోర్టు అథారిటీ (విపిఎ) డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ)కు 2022-23, 2023-24, 2024-25 సంవత్సరాలకుగానూ రూ.57 కోట్ల ఐఎన్‌ఆర్ ప్రాజెక్టు వ్యయంతో వార్షిక నిర్వహణ డ్రెడ్జింగ్ కాంట్రాక్టును పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహనరావు, డిప్యూటీ ఛైర్మన్ దూభే, సెక్రటరీ వేణుగోపాలరావు అందజేశారు. డిసిఐ చీఫ్ హెచ్‌ఒడి కెఎం.చౌదరి పాల్గొన్నారు. డిసిఐ కార్యకలాపాల్లో భాగంగా ఈ కాంట్రాక్టుతో పోర్టు పరిధి వ్యాపార కార్యకలాపాల (హింటర్ ల్యాండ్)లో బీచ్‌లను పోషించేలాగ ఒడ్డునగల ఇసుకను లోపలకు పంపింగ్ చేయడం, నౌకల రాకపోకలకు వీలుగా నీటిలో ఓడలు సురక్షితంగా తేలేలాగ లోతును తీయడం వంటివి ఉన్నాయి. విశాఖ పోర్టు అథారిటీ ద్వారా వార్షిక మెయింటెనెన్స్ సాండ్ ట్రాప్ డ్రెడ్జింగ్ కాంట్రాక్టు డిసిఐకి గొప్ప ఆర్థిక విజయాలు చేకూర్చేలా ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు.










