
ప్రజాశక్తి-గుంటూరు : కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి నిరసనగా స్థానిక ఎన్‌టిఆర్ బస్టాండ్‌లో ఆర్టీసి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిప్రసాద్ మాట్లాడుతూ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన దుండుగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులపై తరచుగా ఇలాంటి భౌతిక దాడులు జరుగుతున్నా యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరించటం వల్లే ఇలాంటివి పునరావృతం అవుతున్నాయని విమర్శించారు. దుండగులు ఏమాత్రం మానవత్వం లేకుండా అమానుషంగా దాడి చేశారని, ఈ దాడిని చూసిన ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఆర్టీసీ ఎమ్‌డి జోక్యం చేసుకొని దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేసేలా చూడాలని, ఉద్యోగులకు మనోధైర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు రవిశంకర్, రామకృష్ణ, ఎన్‌ఎంయు నాయకులు అమర్‌నాధ్, ఇయు నాయకులు పాల్గొన్నారు.
ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్ ఖండన
హార్న్ కొట్టారనే కారణంతో ఆర్టీసీ బస్సును వెంబడించి డ్రైవర్‌పై అత్యంత దారుణంగా దాడి చేసిన అధికార పార్టీ దుండగులను కఠినంగా శిక్షించాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.లక్ష్మణరావు నన్నపనేని శివాజీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే స్పందించి, కఠిన చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.