Dec 29,2022 18:23

ధర్నా చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -నెల్లూరు :నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్‌ కింద పనిచేస్తున్న చెత్త వాహనాల డ్రైవర్లు పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం విధులు బహిష్కరించారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ( సిఐటియు) ఆధ్వర్యంలో నిరసన, ధర్నా జరిగింది. సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో 200కు పైగా చెత్త వాహనాల డ్రైవర్లు ఉన్నారన్నారు. వారిలో 150 మందికి 18,500/- జీతం ఇస్తుండగా మిగతా 50 మందికి 8250/- ఇస్తున్నారన్నారు. నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా కార్పొరేషన్‌ అధికారులు బకాయిలు పెట్టి ఉన్నారన్నారు. సిఐటియు రూరల్‌ కార్యదర్శి కిన్నెర కుమార్‌ మాట్లాడుతూ గత నాలుగు నెలల నుండి జీతాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే కార్మికుల సమస్యల పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు రూరల్‌ కార్యదర్శి వర్గ సభ్యులు డి.సంపత్‌ కుమార్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర కార్యదర్శి ఎం అశోక్‌, నాయకులు వెంకటేశ్వర్లు, పవన్‌ పాల్గొన్నారు.