Jul 17,2023 22:37

ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడ నగరంలో దీర్ఘకాలంగా నిలిచిపోయిన స్ట్రామ్‌ వాటర్‌ (వర్షపు నీటి) డ్రైన్ల నిర్మాణ పనులను పున:ప్రారంభించి, సత్వరమే పూర్తి చేయడానికి నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ ఎక్స్‌అఫిషియో మెంబర్‌, పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శ్రీనివాస్‌ (నాని) కోరారు. ఈ మేరకు ఎంపి ... నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు రాసిన లేఖను టిడిపి కార్పొరేటర్లు కమిషనర్‌కు తన ఛాంబర్‌లో అందజేశారు. నగరంలో సుధీర్ఘకాలంగా స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజి స్కీమ్‌ ఆగిపోయిందని అన్నారు. దీని వల్ల ఏ చిన్నపాటి వర్షం వచ్చినా నగరం చిత్తడిగా తయారవుతుందని అన్నారు. ప్రజల అవస్థలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే నిధులు తెప్పించి, పనులు ప్రారంభించాలని టిడిపి కార్పొరేటర్లు కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో టిడిపి ప్లోర్‌లీడర్‌ నెల్లిబండ్ల బాలస్వామి, డిప్యూటీ ప్లోర్‌లీడర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్‌, దేవినేని అపర్ణ, వీరమాచినేని లలిత, చెన్నుపాటి క్రాంతి శ్రీ, పొట్లూరి శివసాయి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.