May 25,2023 00:14

కాలనీవాసులతో మాట్లాడుతున్న ఎంపిడిఒ

ప్రజాశక్తి - పంగులూరు : సైడు కాలువలు లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మండల పరిధిలోని కోటపాడు దళిత కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపిడిఒ రమణమూర్తిని బుధవారం కలిసి సైడ్‌ కాలువలు నిర్మించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ సైడు కాలువలు లేని కారణంగా మురుగునీరంతా ఎడాది పొడువునా తమ ఇంటి ముందుఉన్న రహదారిపై ప్రవహిస్తున్నట్లు తెలిపారు. దీంతో దోమలు వ్యాప్తి చెంది తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. రాత్రి సమయంలో కంటి మీద కునుకే ఉండటం లేదని తెలిపారు. ప్రసుత్తం డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. తమ కాలనీలో డ్రైనేజీ నిర్మించి తమను ఆదుకోవాలని కోరారు. సుమారు 70 సంవత్సరాల క్రితం తమ కాలనీ ఏర్పడినట్లు తెలిపారు. పోరంబోకు భూమి కావటం వల్ల రోడ్లు ఎక్కువ విస్తీర్ణంలో లేవని తెలిపారు. గతంలో సిమెంట్‌ రోడ్డు వేసినట్లు తెలిపారు. సైడ్‌ కాలువలు నిర్మించలేదని దీంతో మురుగునీంతా రోడ్డుపైనే ప్రవహిస్తున్నట్లు తెలిపారు. కాలనీకి చెందిన కొంతమంది డ్రైనేజీ కట్టకుండా అడ్డంకులు సష్టిస్తున్నట్లు తెలిపారు. మరి కొంతమంది రోడ్డు స్థలాన్ని ఆక్రమించినట్లు తెలిపారు. ఆక్రమణలను తొలగించేందుకు ఆక్రమణదారులు ఒప్పుకోవడం లేదని చెప్పారు. రోడ్డు ఆక్రమణలను తొలగించి డ్రైనేజీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎంపిడిఒ రమణమూర్తి పంచాయతీ సెక్రెటరీ విష్ణుని పిలిచి స్థల వివాదంపై పరిశీలన చేసి తహశీల్దారు కార్యాలయంలో నివేదిక అందజేయాలని సూచించారు. అనంతరం దళితులు పంచాయతీ సెక్రెటరీకి వినతిపత్రం అందజేశారు.