
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతిబాబు
ప్రజాశక్తి - భీమవరం
తీన్మార్ కళాకారులను డప్పు కళాకారులుగా గుర్తించి గుర్తింపు కార్డులివ్వాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు డిమాండ్ చేశారు. శనివారం తీన్మార్ కళాకారుల సమస్యలపై కెవిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కె.క్రాంతిబాబు మాట్లాడుతూ జిల్లాలో డప్పు కళాకారులతో పాటు అదే వృత్తిపై ఆధారపడి పనిచేసే తీన్మార్ కళాకారులు ప్రతి గ్రామంలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న అధునాతన సాంకేతిక అభివృద్ధిలో భాగంగానే తీన్మార్ ముందుకు వచ్చిందన్నారు. తీన్మార్ కళాకారులను కూడా ప్రభుత్వం గుర్తించాలని తెలిపారు. డప్పు, తీన్మార్ కళాకారులకు 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కళాకారుడికీ సంవత్సరానికి డప్పు, గజ్జెల, డ్రెస్సులు ఇస్తున్నట్లు ప్రభుత్వం జిఒ విడుదల చేసినా నేటికీ అమలు కావడం లేదన్నారు. తరతరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న డప్పు కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం, పై అధికారులు డప్పు కళాకారులకు అండగా కొన్ని పథకాలు పెడుతుంటే జిల్లా అధికారులు మాత్రం కేవలం ప్రకటనలు ఇచ్చి తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్వించారు. అర్హులైన కళాకారులకు తక్షణం గుర్తింపు కార్డులివ్వాలని క్రాంతి బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు ఖండెల్లి కృష్ణ, డప్పు కళాకారులు పాల్గొన్నారు.