ప్రజాశక్తి - మండవల్లి
'మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసి రూ.ఐదు వేలు జరిమానా విధించిన ఘటన ఇటీవల చావలపాడు వద్ద చోటుచేసుకుంది. మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను, పొక్లెయిన్లను సీజ్ చేసి రూ.రెండు లక్షలు జరిమానా విధించిన ఘటన మండవల్లిలోనూ చోటు చేసుకుంది. ఇలా అనుమతులు లేకుండా మట్టిని తరలించడం నేరమంటూ అధికారులు జరిమానా విధించిన ఘటనలు గతంలోనూ ఎన్నో ఉన్నాయి. పేదవాడు చిన్న గూడు నిర్మించుకోవడానికి ట్రాక్టర్లపై మట్టిని తరలిస్తే సంఘవిద్రోహక చర్యలకు పాల్పడినట్లు జరిమానా విధించిన అధికారులు తాజాగా మట్టి మాఫియా రెచ్చిపోయి పెద్దఎత్తున మట్టిని తరలించేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
పామర్రు-ఆకివీడు రహదారి సుమారు 65 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేలా రూ.270 కోట్లకు టెండర్ ఖరారైంది. రహదారి అభివృద్ధితోపాటు కల్వర్టులు, వంతెనలు, డ్రెయినేజీలను అభివృద్ధి చేయాలి. రహదారి అభివృద్ధికి అవసరమైన మట్టిని తరలించేలా విధంగా కాంట్రాక్టర్ మట్టి మాఫియాతో డీల్ కుదుర్చుకున్నాడు. మట్టి తరలింపును, టిప్పర్లను అడ్డుకోకుండా ఉండేలా మట్టి మాఫియాదారుడు అధికారులతో లక్షల్లో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. తద్వారా మాఫియాదారుడు మైనింగ్ అనుమతులు లేకుండా లింగాల, కొర్లపాడు గ్రామాల నుండి మట్టిని యథేచ్ఛగా తరలించేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి మాఫియాకు అన్నివిధాలా సహకరిస్తున్న అధికారులు ఇదేమిటని ప్రశ్నించిన వారికి రోడ్డు పనులకేగా అనడం తప్ప పేదల ఇళ్ల స్థలాల మెరకపై ఎందుకు దృష్టి సారించారో ఎవరికీ అర్థంకాని ప్రశ్నగా మారింది. ఇళ్ల స్థలాలు మెరక చేసేందుకు మట్టి దొరకడం లేదని ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్న అధికారులు రోడ్డు పనులకు మట్టి ఎక్కడ నుంచి వచ్చిందంటే నోరుమెదపని పరిస్థితి నెలకొంది. మరి పేదలు మట్టి తీసుకెళ్తుంటే అనుమతుల పేరిట వేధించడం ఏమిటో అధికారులకే తెలియాలి. మట్టిమాఫియాకు సుమారు రూ.వంద కోట్లు మేర లాభం చేకూరేలా అధికారులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియాను నిలువరించి అవినీతిని అరికట్టాలని, పేదల ఇళ్లస్థలాలను తక్షణమే మెరక చేసి సొంతిల్లు నిర్మించుకునేలా పేదలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. దీనిపై తహశీల్దార్‌ను వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.










