ప్రజాశక్తి - దెందులూరు
దోసపాడులో పేదలు గత పది నెలల నుంచి అసైన్డ్, సీలింగ్, గయాళ భూములు పంచాలని పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్ విమర్శించారు. బుధవారం దోసపాడు గ్రామ సచివాలయం వద్ద సాగుతున్న రిలే నిరాహార దీక్షలకు సిపిఎం తరఫున ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక పేదల భూములను కార్పొరేట్ కంపెనీలకు, బడా భూస్వాములకు అప్పనంగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. దళితుల అభ్యున్నతికి పాటుపడతామని చెబుతూనే దళితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని విమర్శించారు. భూస్వాములపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. 25 ఏళ్ల నుండి పేదల భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ అధికారులు రికార్డులు తారుమారు చేస్తూ పేదలను వారి భూములను వారికి దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. మండల రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతుంటే జిల్లా అధికారులు మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు కింద నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ దోసపాడు, పోతునూరు, కొవ్వలి, దెందులూరు తదితర గ్రామాల్లో వందల ఎకరాలు పేదలకు చెందిన భూములు అన్యాకాంతమయ్యాయని, దీనికి రెవెన్యూ శాఖ అధికారులే కారణమని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్‌డిఒ జోక్యం చేసుకుని పేదలకు చెందిన భూములు వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో భూపోరాట నాయకులు ఆనందరావు, సునీల్, వెంకటరమణ, మణి, లక్ష్మి, బేబీ, లలిత, వినోద్, నాగేంద్ర పాల్గొన్నారు.










