Apr 01,2023 21:42

ప్రజాశక్తి - ఏలూరు
            దెందులూరు మండలం దోసపాడు గ్రామానికి చెందిన పేదలు, దళితులు పది నెలల నుండి వారి భూముల కోసం మొక్కుకొని దీక్షతో పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు పట్టించుకో కపోవడం సిగ్గు చేటని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. ఈ భూ పోరాటంలో భాగంగా శనివారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జెసి, ఆర్‌డిఒలకు తపాలాలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఏడాది క్రితం ప్రారంభమైన దోసపాడు భూ పోరాటం పేదలకు, దళితులకు అండగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. ఈ పోరాటంలో పేదలు, దళితులు పలుమార్లు మండల రెవెన్యూ శాఖ అధికారులు, జిల్లా అధికారులను కలిసి వారి గోడు విన్నవించుకున్నప్పటికీ కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. పేదల హక్కులను కాలరాస్తూ, దళితుల చట్టాలను నీరుగారుస్తూ తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు కట్టి మూడు నెలలు దాటినప్పటికీ నేటికీ ఆ కేసులో ఉన్న నిందితులను అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు. పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు భూస్వాములు ఇచ్చే లంచాలు మింగి పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్యలపై జిల్లా కోర్టును ఆశ్రయించగా కోర్టు పేదలకు అనుకూలంగా భూములు సాగు చేసుకోవచ్చని చెప్పినా రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించిన అధికారులపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేదల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే, మంత్రులకు దోసపాడు దళితులు, పేదలు కనబడటం లేదా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం స్పందించి దోసపాడు దళితులకు న్యాయం చేయాలని కోరారు. గ్రామంలో 144, 145 సెక్షన్లు ఎత్తివేసి పేదలకు రక్షణ కల్పించాలన్నారు. ఎవరైతే భూములు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారో వారిపై అసైన్మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 4 ప్రకారం అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి.ఆనందరావు, డి.గంగాధర్‌, సిహెచ్‌.భూషణం, కె.ప్రసాద్‌, సిహెచ్‌.జాన్‌రాజ్‌, ఏసు మణి, మాణిక్యం, హేమలత పాల్గొన్నారు.